
దేశవ్యాప్తంగా మహిళా బాధితులుగా ఉన్న పురుషులు రోడ్డెక్కారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పురుషుల హక్కుల కోసం సత్యాగ్రహ ధర్నా నిర్వహించారు. సేవ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవ్ ఇండియన్ ఫ్యామిలీ మూవ్మెంట్ లో వందలాది మంది పురుషులు, భార్యా బాధితుల సంఘాలు పాల్గొన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 100 మందికి పైగా బాధితులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మహిళల సంరక్షణ చట్టాల దుర్వినియోగం వల్ల పురుషులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తి చూపడంతో పాటు, లింగ తటస్థ చట్టాల అవసరాన్ని వివరించారు.
సేవ్ ఇండియా ఫౌండేషన్, భార్యా బాధితుల సంఘం సహా బాలు ఎన్జీఓ ల ఆధ్వర్యంలో పురుషుల హక్కుల కోసం జాతీయ స్థాయిలో భారీ ధర్నా జరిగింది. మహిళల కోసం జాతీయ మహిళా కమిషన్ ఉన్నట్లే, పురుషుల కోసం ఒక ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పురుషులు. మహిళల సంరక్షణ చట్టాలు, ముఖ్యంగా భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 498ఎ దుర్వినియోగం కారణంగా దేశవ్యాప్తంగా పురుషుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సెక్షన్ 498ఎ కింద తప్పుడు కేసులు దాఖలు చేయడం వల్ల అనేక కుటుంబాలు నాశనమవుతున్నాయని, ఈ చట్టాన్ని రద్దు చేయాలని లేదా దానిని లింగ తటస్థంగా మార్చాలని కోరారు.
ప్రధాన డిమాండ్లు
– పురుషుల హక్కుల పరిరక్షణ: పురుషుల కోసం జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలి.
– లింగ తటస్థ చట్టాలు: ప్రస్తుత చట్టాలను స్త్రీ-పురుషులిద్దరికీ సమానంగా వర్తింపజేసేలా సవరణలు చేయాలి.
– చట్ట దుర్వినియోగానికి శిక్ష: తప్పుడు ఆరోపణలు, కేసులు దాఖలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
సెక్షన్ 498ఎ రద్దు: ఐపీసీ సెక్షన్ 498ఎను రద్దు చేయాలి లేదా దానిని లింగ తటస్థంగా సవరించాలి.
– కాలానుగుణ చట్ట సవరణలు: సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాలను నవీకరించాలి.
సేవ్ ఇండియా ఫౌండేషన్,భార్యా బాధిత సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, మహిళలు జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయించి, వారి హక్కుల కోసం పోరాడగలుగుతున్నప్పుడు, పశువులం కోసం శాఖ ఉన్నపుడు, పురుష బాధితులు ఎందుకు మౌనంగా ఉండాలని ప్రశ్నించారు. చట్టాల దుర్వినియోగం వల్ల అనేక మంది పురుషులు మానసిక, ఆర్థిక ఒత్తిడికి గురై, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఇది సమాజంలో, కుటుంబ వ్యవస్థలో సమతుల్యత కోల్పోవడానికి నిదర్శనమని పేర్కొన్నారు. అతుల్ సుభాష్ కేసును ఉదాహరణగా చూపిస్తూ, సెక్షన్ 498ఎ దుర్వినియోగం వల్ల పురుషులు, వారి కుటుంబాలు ఎలా నాశనమవుతున్నాయో వివరించారు.
తెలుగు రాష్ట్రాల నుంచి విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడ వంటి ప్రాంతాల నుంచి 100 మందికి పైగా బాధితులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. వారు తమ అనుభవాలను పంచుకుంటూ, తప్పుడు ఆరోపణలు, కేసుల వల్ల తమ జీవితాలు ఎలా నాశనమయ్యాయో వివరించారు. “మహిళల హక్కులను కాపాడినట్లే, పురుషుల హక్కులను కూడా పరిరక్షించాలి. సమాజంలో సమానత్వం కోసం లింగ తటస్థ చట్టాలు అవసరం అని బాధితులు తెలిపారు.
ఇటీవల సుప్రీం కోర్టు, ఢిల్లీ హైకోర్టు వంటి న్యాయస్థానాలు సెక్షన్ 498ఎ దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశాయి. సుప్రీం కోర్టు డిసెంబర్ 2024లో ఒక తీర్పులో ఈ చట్టాన్ని వ్యక్తిగత కక్షల కోసం దుర్వినియోగం చేస్తున్నారని, దీనిని అరికట్టడానికి న్యాయస్థానాలు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. ఢిల్లీ హైకోర్టు కూడా ఫిబ్రవరి 2025లో ఒక కేసులో, తప్పుడు ఆరోపణలతో దాఖలైన ఎఫ్ఐఆర్ను రద్దు చేస్తూ, ఈ చట్టం దుర్వినియోగం గురించి వ్యాఖ్యానించింది. ఈ తీర్పులు సత్యాగ్రహం డిమాండ్లకు బలాన్ని చేకూర్చాయి. ఢిల్లీలో జరిగిన పురుషుల సత్యాగ్రహ ధర్నా దేశవ్యాప్తంగా పురుషుల హక్కుల గురించి చర్చను రేకెత్తించింది. సోషల్ మీడియాలో #SatyagrahaForMen, #MensCommission వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో వేలాది మంది తమ మద్దతును తెలియజేశారు. అయితే, కొందరు ఈ ఉద్యమాన్ని మహిళల హక్కులకు వ్యతిరేకంగా చూస్తూ విమర్శలు వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన సేవ్ ఇండియా ఫౌండేషన్, మేము మహిళల హక్కులకు వ్యతిరేకం కాదు. సమాజంలో సమానత్వం కోసం, స్త్రీ-పురుషులిద్దరి హక్కులూ సమానంగా పరిరక్షించబడాలని కోరుతున్నామని స్పష్టం చేసింది.
సేవ్ ఇండియా ఫౌండేషన్ ఈ ఉద్యమాన్ని మరింత ఊపందుకునేలా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. ఈ సందర్భంగా జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాలో పాల్గొన్నవారు, కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పరిశీలించి, పురుషుల హక్కుల కోసం చర్యలు తీసుకోవాలని ఆకాంక్షించారు. “ఇది మొదటి అడుగు మాత్రమే. మా హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది అని తెలిపారు. ఈ సత్యాగ్రహం దేశంలో లింగ సమానత్వం, చట్టాల సమతుల్యతపై కొత్త చర్చకు నాంది పలికినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..