
గురుమూర్తి, ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి.. ప్రస్తుతం డీఆర్డీఓలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తికి మాధవితో 13ఏళ్ల క్రితం వివాహమైంది. అప్పుడు ఆర్మీలో ఉన్న గురుమూర్తి… 35 ఏళ్ల వయసుకే రిటైర్ అయ్యాడు. హైదరాబాద్ మీర్‌పేటలోని ఓ అపార్ట్మెంట్లో కుటుంబంతో కలిసి అద్దెకి ఉంటున్నాడు. అయితే తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. అవి కాస్తా పెద్దవై.. మోస్ట్ బ్రూటల్ మర్డర్‌కు దారితీసింది.
భార్య మాధవిని చంపాలని పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు గురుమూర్తి. అందుకోసం సంక్రాంతి సెలవులని ఎంచుకున్నాడు. ప్రకాశం జిల్లాలో ఉన్న అత్తమామల ఇంటికి ఈనెల 13న తన పిల్లలను పంపాడు. అపార్ట్మెంట్లోనూ చాలామంది పండక్కి ఊర్లకు వెళ్లిపోయారు. దీంతో ఆ ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. ఇదే అదనుగా బావించిన గురుమూర్తి ఈనెల 15న పండగరోజు భార్యను కిరాతకంగా హతమార్చాడు. ఆమెను చంపి, ముక్కలు చేసిన తర్వాత ఆ మాంసం ముద్దలను కుక్కర్లో ఉడకబెట్టాడు. ఆతర్వాత ఎండబెట్టి, పొడిగా చేసి.. దగ్గర్లో ఉన్న జిల్లెల్లగూడ చందనచెరువులో కలిపేశాడు.
ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఈనెల 16న అత్తామామలకు ఫోన్ చేసిన గురుమూర్తి భార్య మాధవి గొడవపడి ఇంట్లోంచి వెళ్లిపోయిందని చెప్పాడు. మీ దగ్గరకు ఏమైనా వచ్చిందా అంటూ తనకేమీ తెలవనట్లు మాట్లాడాడు. వారు తమ దగ్గరకు రాలేదని సమాచారం ఇచ్చారు. అప్పటి నుంచి తరచూ ఫోన్ చేసి భార్య గురించి ఆరా తీస్తున్నట్లు, కంగారుపడుతున్నట్లు నటించాడు. కాని పోలీసుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదు మాత్రం చేయలేదు. ఈనెల 18న హైదరాబాద్ వచ్చిన మాధవి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని చెక్ చేశారు. మాధవి ఇంట్లోకి వెళ్లినట్లు కనిపించింది కానీ.. తిరిగి బయటకు రాలేదు. దీంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన స్టైల్లో దర్యాప్తు మొదలు పెట్టారు.
విచారణలో ఒక్కో విషయం బయటకు వస్తుంటే.. పోలీసులే షాకయ్యారు. భార్యను చంపాక ఆమె మృతదేహాన్ని ఎలా మాయం చేశాడో తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యారు. హత్య జరిగింది.. కానీ శవం ఆనవాళ్లు లేవు..! చంపింది ఎవడో తెలుసు.. కానీ నిరూపించే పక్కా ఆధారాల్లేవ్..! ఓ సైకో క్రిమినల్ మైండ్‌తో చేసిన మర్డర్ ఇప్పుడు షాకింగ్‌గా మారింది..! ఈ క్రైమ్ సీన్ ముందు దృశ్యం, సూక్ష్మదర్శిని లాంటి సినిమాలు ఓ మూలకి కూడా నిలబడవ్..!అంత ప్లాన్డ్గా భార్యను చంపేశాడు ఈ నరరూప రాక్షసుడు..! మర్డర్ నుంచి ఎస్కేప్‌కి మిలటరీ తెలివితేటలు వాడాడు ఈ సైకో. కేసులో సీసీ ఫుటేజ్ కీలకంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.