
ప్రయాగ్‌రాజ్, జనవరి 23: పన్నెండేళ్లకోసారి జరిగే మహాకుంభ మేళాకు నిత్యం కోట్లాది భక్తులు వచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమ ప్రదేశంలో స్నానం ఆచరిస్తే పాపాల నుంచి విముక్తి లభించి, మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకికి చెందిన స్థానిక జర్నలిస్ట్ ఒకరు మహాకుంభ మేళాలో స్నానం, హిందూ దేవతలపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. సొంతంగా వెబ్సైట్, వార్తాపత్రికను నడుపుతున్న కమ్రాన్ అల్వీ అనే జర్నలిస్ట్ మహా కుంభ్‌లో మహిళల వీడియోను షేర్ చేయడమేకాకుండా.. అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. వివరాల్లోకెళ్తే..
జర్నలిస్టు కమ్రాన్ అల్వీ మహా కుంభ మేళలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్న భక్తుల వీడియోలు చిత్రీకరించడేకాకుండా.. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసి అవమానకరమైన వ్యాఖ్యను చేశాడు. ఈ ఘటన యూపీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో జర్నలిస్టు కమ్రాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP) అఖిలేష్ నారాయణ్ సింగ్ మీడియాకు తెలిపారు.
జర్నలిస్ట్ అనుచిత వ్యాఖ్యలతో పాటు పుణ్య స్నానాలు ఆచరిస్తున్న మహిళల అభ్యంతరకరమైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడని ఆయన తెలిపారు. తమ దృష్టికి రావడంతో పోలీసులు వేగంగా చర్యలు తీసుకున్నారని, వెంటనే కేసు నమోదు చేసి సదరు జర్నలిస్టును అరెస్టు చేశారని సింగ్ తెలిపారు. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతోందన్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.