
2025లో మొదటి మేడ్ ఇన్ ఇండియా చిప్ ను విడుదల చేయనునట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. స్విట్జర్లాండ్ లోని దావోస్ జరుగుతున్న డబ్ల్యూఈఎఫ్ సదస్సుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్వని వైష్ణవ్ వెళ్లారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను వెల్లడించారు. భారత దేశ సెమీ కండక్టర్ ప్రోగ్రామ్ పై పరిశ్రమ వాటాదారులు విశ్వాసం కనబర్చారన్నారు. తమ మేడిన్ ఇండియా చిప్ ఈ సంవత్సరం విడుదల అవుతుందన్నారు. తాము పార్ట్ ఫర్ మిలియన్ స్వచ్ఛత నుంచి పార్ట్ ఫర్ బిలియన్ స్వచ్ఛత స్థాయికి వెళ్లాలని, దీని కోసం భారీ పరివర్తనాత్మక మార్పులు అవసరమన్నారు. వాటిని సాధించడానికి పరిశ్రమ చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
మన దేశంలో సెమీ కండక్టర్, డిస్ ప్లే తయారీ కోసం 2021 డిసెంబర్ లో రూ.76 వేల కోట్లతో సెమికాన్ ఇండియా ప్రోగ్రామ్ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారు. సెమీ కండక్టర్లు, డిస్ ప్లే తయారీ, డిజైన్ ఎకోసిస్టమ్ లలో పెట్టుబడి పెట్టే కంపెనీలకు ఆర్థిక సాయం అందించడం దీని ప్రధాన ఉద్దేశం. అలాగే డిజిటల్ ఇండియా కార్పొరేషన్ లో స్వతంత్ర వ్యాపార విభాగంగా ఇండియా సెమీ కండక్టర్ మిషన్ (ఐఎస్ఎం)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీర్ఘకాలిక వ్యూహాలను రూపొందించటానికి, నడిపించడానికి ఈ విభాగానికి పరిపాలన, ఆర్థిక స్వయం ప్రతిపత్తి కూడా కల్పించింది.
సెమీ కండక్టర్ల పరిశ్రమను ప్రోత్సహించడం కోసం విదేశీ పెట్టుబడులను సైతం మన దేశం ఆకర్షిస్తోంది. ఎన్ఎక్స్ పీ సెమీ కండక్టర్స్ భారత దేశంలో దాని ఆర్అండ్ డీ ప్రయత్నాలను రెట్టింపు చేయడానికి ఒక బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. అలాగే దేశంలో సెమీకండక్టర్ల తయారీకి సంబంధించి అనలాగ్ డివైజెస్ టాటా గ్రూపుతో సహకరిస్తోంది. మైక్రో టెక్నాలజీ గుజరాత్ లో 2.75 బిలియన్ డాలర్లతో అసెంబ్లింగ్, టెస్టింగ్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా 5 వేల ప్రత్యక్ష్య ఉద్యోగాలు, 15 వేల కమ్యూనిటీ ఉద్యోగాలు వచ్చే అవకాశం కలుగుతుంది. ఒక నివేదిక ప్రకారం 2026 నాటికి మన దేశంలో 63 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..