
ప్రస్తుతం మీన రాశిలో నీచ స్థితిలో సంచారం చేస్తున్న బుధ గ్రహానికి అనేక విధాలుగా బలం పెరిగింది. నిజానికి ఈ గ్రహానికి నీచత్వం తొలగిపోయి, ఉచ్ఛ స్థితి కంటే బలం పెరిగింది. అందుకు కారణంగా బుధుడు మీన రాశిలో నాలుగు మిత్ర గ్రహాలతో యుతి చెంది ఉండడం. దీనవల్ల కొద్దిపాటి ప్రయత్నం కూడా అవసరం లేని శుభ ఫలితాలు కలుగుతాయి. అప్రయత్న ధన లాభం, అప్రయత్న ఉద్యోగ లాభం వంటివి కలిగే అవకాశం ఉంది. వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభ రాశుల వారికి బుధుడి బలం వల్ల మే 4 వరకు అనేక లాభాలు కలగబోతున్నాయి.
- వృషభం: ఈ రాశికి అత్యంత శుభుడైన బుధుడికి లాభ స్థానంలో బలం పెరిగినందువల్ల ధనాభివృద్ధికి అవకాశాలు, మార్గాలు బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆర్థికాభివృద్ధికి సంబంధించిన ఏ అవకాశాన్నీ వదులుకోవడం జరగదు. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఇతరులకు ఇచ్చే సలహాలు, సూచనల వల్ల ఆర్థిక లాభం పొందుతారు. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది. సొంత ఇంటి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది.
- మిథునం: ఈ రాశికి అధిపతి అయిన బుధుడు దశమ స్థానంలో బలం పుంజుకున్నందువల్ల ఉద్యోగపరంగా కొన్ని కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి. ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కష్టనష్టాల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపార సంబంధాలు వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి.
- కన్య: రాశ్యధిపతి బుధుడికి సప్తమ స్థానంలో బలం పెరిగినందువల్ల ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. ప్రేమ ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అందుతాయి. విదేశాల్లో ఉద్యోగం చేసుకుంటున్నవారికి ఉద్యోగంలోనూ, జీవితం లోనూ స్థిరత్వం లభిస్తుంది. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక వివాదాలు, ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
- వృశ్చికం: ఈ రాశివారికి లాభాధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలో బలోపేతం అయినందువల్ల వృత్తి, ఉద్యోగంలో సమర్థత, నైపుణ్యాలు మరింతగా వృద్ధి చెందుతాయి. మీ సలహాలు, సూచనల వల్ల సంస్థకు ప్రయోజనం కలుగుతుంది. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. సంతానం కలగడానికి అవకాశం ఉంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. ఆదాయ ప్రయత్నాలు అంచనాలకు మించిన ఫలితాలనిస్తాయి. తల్లితండ్రుల నుంచి ఆస్తిపాస్తులు లభించే అవకాశం ఉంది.
- మకరం: ఈ రాశికి అత్యంత శుభుడైన బుధుడు తృతీయ స్థానంలో బలంగా ఉన్నందువల్ల అప్రయత్న ధన లాభం కలుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీల వల్ల ఊహించని లాభాలు అందుతాయి. ప్రయాణాల వల్ల బాగా లాభం ఉంటుంది. ఏ ప్రయత్నం చేపట్టినా విజయం వరిస్తుంది. అదనపు ఆదాయానికి లోటుండదు. ఆర్థిక, వ్యక్తిగత, అనారోగ్య సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి.
- కుంభం: ఈ రాశికి శుభుడైన బుధుడు ధన స్థానంలో బలమైన సంచారం చేస్తున్నందువల్ల ఆర్థిక లాభాలు ఎక్కువగా కలుగుతాయి. ఆకస్మిక ధన లాభానికి, అప్రయత్న ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. రావలసిన సొమ్ము, రాదనుకున్న సొమ్ము అనుకోకుండా చేతికి అందుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు చోటు చేసుకుంటాయి. ఆస్తి లాభం, భూ లాభం కలుగుతాయి. శుభ కార్యాలు, దైవ కార్యాల మీద ఎక్కువగా ఖర్చు పెడతారు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.