
ఉగాది రోజున శనీశ్వరుడు మీన రాశిలో ప్రవేశించడం, అదే రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్న శుక్రుడు మరో శుభ గ్రహమైన గురువుతో పరివర్తన చెందడం వల్ల కొన్ని రాశుల వారికి మార్చి 30 తర్వాత నుంచి ప్రేమ యోగం పట్టబోతోంది. శుక్రుడు మే 31 వరకూ ఉచ్ఛలో కొనసాగడం, గురువుతో పరివర్తన చెంది ఉండడం వల్ల ప్రేమ యోగాలు పట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శుక్ర రాశులైన వృషభ, తులా రాశులు, కర్కాటకం, కన్య, వృశ్చిక, కుంభ రాశుల వారు ప్రేమల్లో పడే అవకాశం ఉంది. మార్చి 30 నుంచి మే 31లోగా ప్రేమలో పడే రాశుల వారికి తప్పకుండా ప్రేమలు విజయవంతమై, పెళ్లిళ్లకు దారితీసే అవకాశం ఉంది.
- వృషభం: రాశ్యధిపతి శుక్రుడు లాభస్థానంలో ఉచ్ఛ స్థితిలో కొనసాగుతున్నందువల్ల ఈ రాశివారిని ఎవరైనా ప్రేమించే అవకాశం ఎక్కువగా ఉంది. సాధారణంగా బాగా పరిచయస్థులతో కానీ, ఉద్యోగంలో సహచరులతో కానీ ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. పెళ్లే లక్ష్యంగా వీరి ప్రేమ జీవితం కొనసాగు తుంది. వీరికి జూలై, అక్టోబర్ నెలల మధ్య సాంప్రదాయబద్ధంగా పెళ్లి జరిగే అవకాశం కూడా ఉంది. గురు, శుక్రుల మధ్య పరివర్తన చెందినందువల్ల ప్రేమ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది.
- కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంలో కళత్ర కారకుడు శుక్రుడు ఉచ్ఛ పట్టడంతో పాటు, లాభ స్థానంలో ఉన్న గురువుతో పరివర్తన చెందినందువల్ల సంపన్న లేదా ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం ఉంది. ఇద్దరి మధ్యా అనుకోకుండా ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసే సూచనలున్నాయి. వీరి మధ్య జూలై తర్వాత తప్పకుండా పెద్దల అనుమతితో పెళ్లి నిశ్చయమయ్యే అవకాశం ఉంది. ప్రేమ జీవితం ఉత్సాహంగా, సుఖ సంతోషాలతో సాగిపోతుంది.
- కన్య: ప్రేమలు, పెళ్లిళ్లకు కారకుడైన శుక్రుడు సప్తమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉండడంతో పాటు, శుభ కార్యాలకు కారకుడైన గురువుతో పరివర్తన చెందడం వల్ల ఈ రాశివారిని సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి ప్రేమించే అవకాశం ఉంది. ఈ ప్రేమ జీవితం అక్టోబర్ తర్వాత తప్పకుండా పెళ్లికి దారితీస్తుంది. తల్లితండ్రుల అనుమతి లభించడంతో పాటు సంప్రదాయికంగా వివాహం జరిగే సూచనలున్నాయి. సాధారణంగా వీరి ప్రేమ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది.
- తుల: రాశినాథుడైన శుక్రుడు ఉచ్ఛ స్థితిలో ఉండడం, గురువుతో పరివర్తన చెందడం వల్ల ఈ రాశివారు తప్పకుండా ప్రేమలో పడే అవకాశం ఉంది. వీరి ప్రేమ జీవితం సుఖ సంతోషాలతో, సఖ్యత, సాన్నిహిత్యాలతో సాగిపోతుంది. సాధారణంగా సహోద్యోగితో, సంపన్న కుటుంబానికి చెందిన పరిచయస్థుడితో ప్రేమలో పడడం జరుగుతుంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో ఈ ప్రేమ జీవితం పెళ్లి జీవితంగా మారే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో కొద్దిపాటి సమస్యలు, ఒడిదుడుకులు తప్పకపోవచ్చు.
- వృశ్చికం: ఈ రాశికి పంచమ స్థానంలో ఉచ్ఛ శుక్రుడు, సప్తమ స్థానంలో గురువు సంచారం వల్ల వీరిని ఎవరైనా తప్పకుండా ప్రేమించే అవకాశం ఉంది. వీరిలో జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది. బంధువర్గానికి చెందిన సంపన్న వ్యక్తితో ప్రేమలో పడడం జరుగుతుంది. మొదట్లో కొద్దిపాటి సమస్యలున్న ప్పటికీ, క్రమంగా సాన్నిహిత్యం పెరిగి, పెద్దల అనుమతి సంపాదించే అవకాశం ఉంది. సాధారణంగా వీరి ప్రేమలు నవంబర్ తర్వాత పెళ్లికి దారితీసే అవకాశం ఉంది. ప్రేమ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
- కుంభం: ఈ రాశికి కుటుంబ స్థానంలో శుక్రుడు ఉచ్ఛపట్టడంతో పాటు కుటుంబ స్థానాధిపతి అయిన గురువుతో పరివర్తన చెందడం వల్ల ఈ రాశివారిని ఎవరైనా ప్రేమించే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తి వీరి జీవితంలోకి ప్రవేశించడం జరుగుతుంది. జూలై తర్వాత వీరికి సంప్రదాయబద్ధంగా పెళ్లి జరిగే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు, అపార్థాలు తప్పకపోవచ్చు. అయితే, ఈ సమస్యలన్నీ పరిష్కారమయి సాన్నిహిత్యం పెరుగుతుంది.