
Saturn Transit Impact: సాధారణంగా శని దృష్టి పడితే సర్వ నాశనం తప్పదనే అపోహ ఒకటుంది. ఇందులో కొంత నిజం ఉన్నప్పటికీ, కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. తుల, ధనుస్సు, మీన రాశుల నుంచి శని ఏ రాశులను చూసినా ఆ రాశులకు ఉత్తమ ఫలితాలుంటాయని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. శని తానున్న రాశి నుంచి 3, 7, 10 రాశులను వీక్షిస్తాడు. ప్రస్తుతం మీన రాశిలో ఉన్నందువల్ల శనీశ్వరుడు వృషభ, కన్య, ధనూ రాశులను వీక్షించడం జరుగుతుంది. ఈ వీక్షణ వల్ల ఈ రాశుల వారిలో యాక్టివిటీ పెరుగుతుంది, ఆదాయ, ఉద్యోగ యోగాలు పడతాయి. ఈ మూడు రాశులతో పాటు తానున్న మీన రాశికి, తన సొంత రాశులైన మకర, కుంభ రాశులకు శని శుభ ఫలితాలనిస్తాడు.
- వృషభం: ఈ రాశికి భాగ్య, దశమాధిపతిగా అత్యంత శుభుడైన శనీశ్వరుడు లాభ స్థానంలో ఉండడంతో పాటు, తృతీయ దృష్టితో ఈ రాశిని వీక్షించడం వల్ల అనేక విధాలుగా అదృష్టాలు పట్టే అవకాశం ఉంది. శని మీన రాశిలో ఉన్న రెండున్నరేళ్ల కాలంలో వృషభ రాశివారికి ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
- కన్య: ఈ రాశిని శనీశ్వరుడు సప్తమ దృష్టితో వీక్షించడం వల్ల ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. సంపన్న వ్యక్తితో ప్రేమలో పడడం కూడా జరుగుతుంది. వృత్తి, వ్యాపా రాల్లో స్తబ్ధత తొలగిపోయి యాక్టివిటీ బాగా పెరుగుతుంది. రాజకీయ సంబంధమైన పరిచయాలు వృద్ధి చెందుతాయి. విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. అదనపు ఆదాయ మార్గాల ద్వారా ఆదాయాన్ని బాగా పెంచుకునే అవకాశం ఉంది.
- ధనుస్సు: ఈ రాశి మీద శని దశమ దృష్టి వల్ల ఈ రాశివారిలో యాంబిషన్ బాగా పెరుగుతుంది. కొద్ది శ్రమతో ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు అధికారం కోసం ప్రయత్నించి సాధించుకునే అవకాశం ఉంది. మనసులోని కోరికలు ఒకటి రెండు నెరవేరుతాయి. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు అందుతాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. ఈ రాశికి అర్ధాష్టమ శని దోషం కూడా ఎక్కువగా ఉండకపోవచ్చు. ఆస్తి వ్యవహారాలు చక్కబడతాయి. సొంత ఇల్లు లభించే అవకాశం ఉంది.
- మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో ప్రవేశించిన రాశ్యధిపతి శనీశ్వరుడు ఈ రాశివారికి ఊహించని పురోగతినిస్తాడు. ఆదాయం బాగా వృద్ధి చెంది ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో అనేక ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆస్తి వ్యవహారాలు చక్కబడతాయి.
- కుంభం: రాశినాథుడు శని ద్వితీయ స్థానంలో సంచారం వల్ల ఏలిన్నాటి శని దోషం కలిగే అవకాశం ఉన్నా, సొంత రాశి అయినందువల్ల శనీశ్వరుడు ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు. ప్రతి పనికీ ఎక్కువ శ్రమ పడడం, కొద్దిగా ఆలస్యం కావడం వంటి చిన్నపాటి సమస్యలు మాత్రమే ఈ రాశి వారికి ఇబ్బంది పెడతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. పదోన్నతులు కలుగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి.
- మీనం: ఈ రాశిలో శని సంచారం వల్ల ఏలిన్నాటి శని దోషం కలిగినప్పటికీ, మీన రాశి గురువుకు సంబంధించిన రాశి అయినందువల్ల ఈ శని దోషం వల్ల పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చు. మీన రాశిలో ఉన్న శని ఆధ్యాత్మిక చింతనను పెంచుతాడు. ఆర్థిక, వ్యక్తిగత, ఆరోగ్య సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ప్రతి పనీ ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుందే తప్ప జరగకుండా పోదు. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు క్రమంగా పెరుగుతాయి.