
మన ఈ రోజువారీ జీవితంలో గ్యాస్ సిలిండర్ అనేది చాలా ముఖ్యమైనది. ఈరోజుల్లో కట్టెల పొయ్యిలు కంటే కూడా ఎక్కువ మొత్తంలో గ్యాస్ సిలిండర్ లే వాడుతున్నారు. కొందరి దగ్గర రెండు, మూడు సిలిండర్లు ఉంటాయి. అయినా కూడా ఎప్పుడు అయిపోతుందోనన్న భయంతో ముందుగానే ఇంకొకటి బుక్ చేసుకుంటారు. ఇలాంటి వారి కోసమే కొన్ని చిట్కాలను తీసుకొచ్చాను. వంట గ్యాస్ ఎక్కువ రోజులు రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గ్యాస్ స్టవ్ బర్నర్
గ్యాస్ స్టవ్ బర్నర్ లో మురికి చేరితే గ్యాస్ సరిగా రాదు పైగా మంట కూడా చిన్నగా వస్తుంది. ఈ కారణంగా గ్యాస్ ఎక్కువగా వృథా అవుతుంది. గ్యాస్ లీక్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. బర్నర్ శుభ్రంగా ఉంటే మంట పెద్దగా వస్తుంది. గ్యాస్ కూడా ఆదా అవుతుంది.
తడి గిన్నెలతో వంట
వంట పాత్రలు తడిగా ఉంటే అవి వేడి అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ఈ సమయంలో గ్యాస్ వృథా అవుతుంది. అందువల్ల వంటకు ముందే పాత్రలను పొడిగా ఉంచడం ముఖ్యం. వంటకు ముందే గిన్నెలను తుడిచిపెట్టడం అలవాటు చేసుకుంటే గ్యాస్ ఆదా అవుతుంది.
గిన్నెలకు మూతలు తప్పనిసరి
వంట చేసే సమయంలో గిన్నెలకు మూత పెట్టడం తప్పనిసరి. మూత పెట్టకపోతే వంటకు ఎక్కువ సమయం పడుతుంది. మరీ అవసరమైతే ప్రెషర్ కుక్కర్ వాడడం మంచి ఆప్షన్. ఇది గ్యాస్‌ను ఎక్కువ రోజులు నిల్వ ఉంచడంలో సహాయపడుతుంది.
ఫ్రిజ్‌లోని ఆహారం
ఫ్రిజ్ నుంచి తీసిన కూరగాయలు, ఆహార పదార్థాలను ఉడికించడానికి ముందు కాస్త సమయం ఇవ్వాలి. ఫ్రిజ్ నుండి తీయగానే వంట చేయడం వల్ల అవి వేడి కావడానికి ఎక్కువ గ్యాస్ ఖర్చవుతుంది. ఆహార పదార్థాలు గదిలో ఉంచి కొంత సమయం తర్వాత వంటకు ఉపయోగిస్తే గ్యాస్ ఆదా అవుతుంది.
ఉడికించేవి ముందే నానబెట్టడం
బియ్యం, పప్పులు వంటి పదార్థాలను ముందుగా కొంతసేపు నీటిలో నానబెడితే త్వరగా ఉడుకుతాయి. ఇది గ్యాస్ వినియోగాన్ని తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. ఇదే కాకుండా తక్కువ సమయంతోనే వంట పూర్తి అవుతుంది.
ఫ్లాట్ పాన్
వంటకు పాన్ ఉపయోగించడం గ్యాస్ ఆదా చేయడానికి మంచి మార్గం. ఫ్లాట్ పాన్ కు వేడి సమానంగా వ్యాపిస్తుంది. దీని వల్ల వంట త్వరగా అవుతుంది. ఇతర పాత్రలతో పోలిస్తే ఫ్లాట్ పాన్ వేడి సమానంగా విస్తరించడానికి సమయం తీసుకోదు. ఇది గ్యాస్ తక్కువగా వినియోగిస్తుంది.