
స్టీల్ ప్రెషర్ కుక్కర్లు ఎక్కువకాలం ఉపయోగపడకపోవటం గురించి చాలా మంది ఫిర్యాదు చేస్తారు. కుక్కర్ లో వంట చేసేటప్పుడు ఆహారం అడుగంటిపోతుంది. దీంతో కుక్కర్ అడుగు నల్లగా మారుతుంది. ఇలా అయితే కుక్కర్ వాడటం ఇబ్బందిగా మారుతుంది. మరకల వల్ల వంట కూడా సరిగ్గా కుదరదు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు కొన్ని సరళమైన పద్ధతులు ఉన్నాయి. వాటిని ఇంట్లోనే సులభంగా ట్రై చేయొచ్చు.
రోజూ వాడటం వల్ల స్టీల్ కుక్కర్ లోపల నుండి కాలిపోతుంది. కింద నల్లటి మరకలు పడతాయి. వాటిని తొలగించడం కష్టంగా మారుతుంది. ఎంత శుభ్రం చేసినా పూర్తిగా మెరుపు రావడం లేదు అనిపిస్తుంది. అలా వదిలేస్తే తర్వాత వాడినప్పుడు మరింతగా కాలిపోతుంది. ఇది కేవలం మీకే కాదు.. అందరికీ ఎదురయ్యే సాధారణ సమస్య. అయితే కాస్త చిట్కాలు పాటిస్తే కుక్కర్ మళ్లీ కొత్తదిలా మారుతుంది.
బేకింగ్ సోడా, వెనిగర్ మిశ్రమం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ముందుగా కుక్కర్లో కొద్దిగా నీరు పోయాలి. తర్వాత రెండు మూడు టీస్పూన్ల బేకింగ్ సోడా వేసి దానికి ఒక కప్పు వెనిగర్ కలిపాలి. దీన్ని ఐదు నుంచి ఏడు నిమిషాలు తక్కువ మంట మీద వేడి చేయాలి. ఇందులో నురుగు వచ్చేసరికి మంట ఆపాలి. చల్లబడిన తర్వాత స్పాంజ్ లేదా సాఫ్ట్ స్క్రబ్బర్ తీసుకుని కుక్కర్‌ను నెమ్మదిగా శుభ్రం చేయాలి. అప్పుడు కాలిన మరకలు సులభంగా తొలగిపోతాయి.
నిమ్మకాయ, ఉప్పు కూడా బాగా పని చేస్తుంది. కుక్కర్లో కొద్దిగా నీరు పోయాలి. అందులో సగం నిమ్మకాయ రసం పిండి వేసుకోవాలి. తర్వాత రెండు మూడు టీస్పూన్ల ఉప్పు కలిపి పది నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత నెమ్మదిగా స్క్రబ్ చేస్తే ఎక్కువ రుద్దాల్సిన పనిలేకుండా మరకలు పోతాయి. కుక్కర్ మళ్లీ మెరుపు తిరిగి పొందుతుంది.
మరకలు చాలా లోతుగా లేకపోతే ఈ పద్ధతి సరిపోతుంది. కుక్కర్‌ను వేడి నీటితో నింపాలి. దీంట్లో రెండు మూడు టీస్పూన్ల డిష్‌వాషింగ్ లిక్విడ్ వేసి కలిపి 15 నుంచి 20 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత స్పాంజ్ లేదా స్క్రబ్బర్‌తో తేలికగా శుభ్రం చేయాలి. ఇలా చేస్తే కుక్కర్ కొత్తగా మెరిసిపోతుంది.
మరొక చిట్కా.. ఒక బంగాళాదుంపను సగానికి కట్ చేయాలి. కత్తిరించిన భాగంపై కొద్దిగా డిటర్జెంట్ పెట్టాలి. ఆ బంగాళాదుంప భాగంతో కుక్కర్లోని కాలిన చోట రుద్దాలి. కొన్ని నిమిషాల్లోనే మరకలు తగ్గిపోతాయి.
కుక్కర్‌ను శుభ్రంగా ఉంచుకోవడం కష్టంగా అనిపించినా.. ఈ చిట్కాలు పాటిస్తే చాలా సులభమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం మీకు ఈ సమస్యలు ఎదురైతే వెంటనే ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అయ్యి చూడండి. మీ కుక్కర్ మళ్లీ కొత్తదిలా మెరిసిపోతుంది.