

బీపీ షుగర్ వ్యాధుల బారిన పడటం ఇప్పుడు చాలా కామన్. అంతమాత్రంచేత బీపీ షుగర్లను నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రమాదం తప్పదు అంటున్నారు నిపుణులు. కిడ్నీ వ్యాధులు రావడానికి 70 శాతానికి పైగా కారణం బీపీ, షుగర్ అంటున్నారు. ఇవేకాక వంశపారంపర్యంగా, కాలుష్యం, మన ఆహారపు అలవాట్లు కూడా కిడ్నీ జబ్బులు రావడానికి దోహదంచేస్తాయని వైద్యులు చెబుతున్నారు.
ప్రమాదకర వ్యాధుల్లో కిడ్నీ వ్యాధికి ఆరో స్థానం
దేశంలో మరణాలకు కారణమవుతున్న ప్రమాదకర వ్యాధుల్లో కిడ్నీ వ్యాధి ఆరో స్థానంలో ఉంది. దేశంలో ఏటా 2 లక్షల నుంచి 2.5 లక్షల మంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నట్లు ఇండియన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ జర్నల్ వెల్లడించింది.
బీపీ, షుగర్ నియంత్రణ లేకపోవడంతో కిడ్నీ జబ్బులు
బీపీ, షుగర్ నియంత్రణలో లేకపోవడంతో దాదాపు 90 శాతం మంది కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు. ప్రస్తుతం మన దేశంలో దాదాపు 30 లక్షలకు పైగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారాని అంచనా. ప్రతి సంవత్సరం అదనంగా మరో రెండు లక్షల మంది ఈ గ్రూపులో చేరుతున్నరని నిపుణులు అంటున్నారు.
హైదరాబాద్లో ఏటా 40వేల కిడ్నీ వ్యాధి కేసులు
ఒక్క హైదరాబాద్ పరిధిలో ఏటా 40 వేల మంది కిడ్నీ సంబంధిత వ్యాధులకు గురవుతున్నారని అంచనా. వీరిలో 30 శాతం మంది వరకు కూడా డయాలసిస్ అవసరమయ్యే పరిస్థితులు ఉన్నాయని వైద్యులు అంటున్నారు. వీరందరికీ కారణం హైబీపీ, మరి కొంతమందిలో డయాబెటిస్, కిడ్నీలలో రాళ్లూ రావడంతో కిడ్నీలు పాడైపోవడం లాంటి కారణాలు ఎక్కువ. దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడేవారి సంఖ్య పెరగడానికి కారణం కిడ్నీ సంబంధిత వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తించకపోవడమేనంటున్నారు వైద్యులు.
వికారంగా ఉండడం, వాంతులు, ఆకలి లేకపోవడం, పాదాలు, చీలమండ వద్ద వాపు, తక్కువగా శ్వాస తీసుకోవడం, నిద్రలేమి, ఎక్కువగా లేదా తక్కువగా మూత్రవిసర్జన లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదిస్తే మంచిది. ముఖ్యంగా బీపీ షుగర్ ఉన్నవారు తప్పనిసరిగా ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. సంవత్సరానికి ఒక్కసారైనా కిడ్నీ ఫంక్షన్ పరీక్షలు చేసుకుంటే బెటర్ అని అంటున్నారు. వీటన్నిటి కంటే ముందు పరిశుభ్రమైన ఆహారం తగినంత నీరు శరీరానికి అందిస్తే సమస్య దరిచేరకుండా ఉంటుందని వైద్యులంటున్నారు.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.