విద్యార్థుల మధ్య జరిగిన ఓ చిన్న గొడవ కాస్తా.. ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తెలిసీ తెలియని వయసులో విచక్షణ కోల్పోయి ఆ విద్యార్థులు ప్రవర్తించిన తీరు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రెండు స్థానిక పాఠశాలల విద్యార్థుల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణలో ఓ విద్యార్థి తలకు తీవ్ర గాయమైంది. అందుకు కారణమైన మరో నలుగురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కేరళలోని కోజికోడ్ తామరస్సేరిలోని ఒక ప్రైవేట్ ట్యూషన్ సెంటర్ సమీపంలో కొందరు విద్యార్థులు ఘర్షణకు దిగారు. ఫిబ్రవరి 23న పాఠశాలలో జరిగిన వీడ్కోలు పార్టీకి సంబంధించి గొడవ జరిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రెండు వేర్వేరు పాఠశాలలకు చెందిన విద్యార్థులు వాగ్వాదానికి దిగడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ గొడవలో ఓ 10వ తరగతి విద్యార్థి మహ్మద్ షహబాస్ తలకు తీవ్రంగా గాయమైందని పోలీసులు నిర్ధారించారు. పార్టీ సమయంలో కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా డాన్స్ ప్రోగ్రాంకి అంతరాయం ఏర్పడింది. నృత్య ప్రదర్శన సందర్భంలో మ్యూజిక్ ఆగిపోవడంతో అది చూసి పక్కనే ఉన్న మరో పాఠశాల విద్యార్థులు అవహేళన చేయడంతో అది కాస్తా ఘర్షణకు దారి తీసింది.
దీంతో ఆ విద్యార్థుల మధ్య విభేదాలు పెరిగాయి. ఘటనకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించిన వాట్సాప్ మెసేజ్‌ను గుర్తించిన పోలీసులు అందుకు కారణమైన ఐదుగురు విద్యార్థులపై కేసు నమోదు చేశారు. గాయపడిన విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండటంతో కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేరాడు. కాగా, ఆ విద్యార్ధి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
