
హిందూ మత గ్రంథాలలో ఏకాదశి తిధికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఒక సంవత్సరంలో 24 ఏకాదశి తిథులు ఉంటాయి. ఏకాదశి తిథిని లోక రక్షకుడు శ్రీ హరి విష్ణువుకు అంకితం చేశారు. చైత్ర మాసంలోని శుక్ల పక్షంలో కామద ఏకాదశి ఉపవాసం పాటిస్తారు. దీనినే సౌమ్య ఏకాదశి , కామద ఏకాదశి , దమన ఏకాదశి అని కూడా అంటారు. కామద ఏకాదశి రోజున శ్రీ హరి విష్ణువును పూజిస్తారు. ఉపవాసం ఉంటారు. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువుని పూజించడం వలన పాపం నశిస్తుందని.. దుఃఖాల నుండి విముక్తి పొందుతాడని విశ్వాసం. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. ఈ రోజు ఏప్రిల్లో కామద ఏకాదశి ఎప్పుడు వచ్చింది? పూజా శుభ సమయం, పూజా విధానం? నియమాలు తెలుసుకుందాం..
హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిథి ఏప్రిల్ 7న రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ శుక్ల పక్ష ఏకాదశి తిథి ఏప్రిల్ 8న రాత్రి 9:12 గంటలకు ముగుస్తుంది. హిందూ మతంలో ఉదయ తిథి పూజకు అర్హంగా పరిగణించబడుతుంది. అంటే ఏకాదశి తిథి సూర్యోదయం నుంచి లెక్కించబడుతుంది. కనుక ఉదయతిథి ప్రకారం కామద ఏకాదశి ఏప్రిల్ 8న జరుపుకోనున్నారు. ఈ రోజున ఉపవాసం ఉంటారు. విష్ణువు పూజ చేస్తారు.
కామద ఏకాదశి పూజా విధానం
చైత్ర శుద్ధ ఏకాదశి రోజునే కామదా ఏకాదశి అని దమన ఏకాదశి అని పిలుస్తుంటారు. ఈ రోజున వివాహితులు లక్ష్మీనారాయణులను ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది. కామద ఏకాదశి నాడు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి. తరువాత దేవతలను ధ్యానించాలి.ఉపవాసం ఉంటానని సంకల్పం చేయాలి. దీని తరువాత శ్రీ హరి విష్ణువు విగ్రహం లేదా చిత్రపటాన్ని ఆలయంలోని వేదికపై శుభ్రమైన పసుపు వస్త్రాన్ని పరిచి ఉంచాలి. దీని తరువాత పసుపు, అక్షతం, గంధం, పువ్వులు మొదలైనవి దేవునికి సమర్పించాలి.
ఇవి కూడా చదవండి
దీనితో పాటు అరటిపళ్ళు, పంచామృతం, తులసి దళాలు, సగ్గు బియ్యంతో చేసిన పాయసం, స్వీట్లు విష్ణువుకి నైవేద్యంగా సమర్పించాలి. అగరుబత్తులు, దీపాలు వెలిగించాలి. తరువాత విష్ణువు మంత్రాలను జపించాలి. విష్ణు చాలీసా, కామద ఏకాదశి వ్రత కథను పఠించాలి. పూజ అనంతరం హారతి ఇచ్చి పూజను ముగించాలి. ఈ రోజు సాయంత్రం తులసి మొక్క ముందు నెయ్యి దీపం వెలిగించాలి.
కామద ఏకాదశి పూజా నియమాలు
కామద ఏకాదశి రోజున రాత్రి నిద్రపోకుండా జాగారం చేయాలి. విష్ణువుని కీర్తిస్తూ భజనలు పాడాలి. ఈ రోజున బ్రాహ్మణులకు అన్నదానం చేసి, దక్షిణ ప్రసాదం ఇవ్వాలి. ఈ రోజున దానధర్మాలు చేయాలి. ఈ రోజున జుట్టు, గోళ్లను కత్తిరించకూడదు. ఉపవాసం చేసిన వారు నిద్రపోకూడదు. మాంసం, మద్యానికి దూరంగా ఉండాలి. ఈ రోజున ఎవరిని దూషించకూడదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు