
న్యూఢిల్లీ, జనవరి 25: దేశంలో పర్యాటక – ఆతిథ్య రంగం (Travel and Hospitality Sector) బలమైన వృద్ధిని సాధిస్తోంది. తాజా సర్వేలో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు తేలింది. టీమ్‌లీజ్ సర్వీసెస్ నిర్వహించిన సర్వేలో 66 శాతం కంపెనీలు తమ వర్క్‌ఫోర్స్‌ను విస్తరించాలని యోచిస్తున్నట్లు తెలిపాయి. ఆ మేరకు ఆ రంగంలో ఉపాధి అవకాశాలు భారీగా పెరగనున్నాయి. ఆ మేరకు టీమ్‌లీజ్ సర్వీసెస్ విడుదల చేసిన ఎంప్లాయ్మెంట్ ఔట్లుక్ రిపోర్ట్ (TeamLease Report)లో వెల్లడించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో అర్థ సంవత్సరంలో పర్యాట, ఆతిథ్య రంగాల్లో 8.2 శాతం నికర ఉపాధి మార్పు (NEC)ని అంచనా వేసింది. ఉపాధి కల్పనలో ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ రంగంలో మెరుగైన అవకాశాలు ఉంటాయని ఈ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. దీంతో భారత పర్యాటక పరిశ్రమకు ముందు ముందు అన్ని మంచిరోజులే అన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
భవిష్యత్తులో భారత దేశ జీడీపీ వృద్ధిలో పర్యాటక, ఆతిథ్య రంగాల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. 2024లో దేశ జీడీపీలో పర్యాటక, ఆతిథ్య రంగం వాటా 9 శాతం (11 ట్రిల్లియన్ల అమెరికా డాలర్లు)గా ఉంది. ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే 12 శాతం వృద్ధిని నమోదుచేసుకోవడం విశేషం.
ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో తీర్థయాత్రలు చేపట్టే దేశీయ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన స్వదేశ్ దర్శన్ స్కీమ్, థీమ్ ఆధారిత టూరిస్ట్ సర్క్యూట్ డెవలప్మెంట్, ప్రసాద్ స్కీమ్ తదితర ప్రభుత్వ పథకాలతో పాటు విమానాశ్రయ మౌలిక సదుపాయాలు, ప్రాంతీయ కనెక్టివిటీలో గణనీయమైన పెట్టుబడులు వంటి ప్రభుత్వ కార్యక్రమాలు ఈ తీర్థయాత్రలు చేపట్టే వారి సంఖ్య గణనీయంగా వృద్ధి చెందడానికి దోహదపడుతోంది.
గ్లోబల్ టూరిజం వృద్ధి సాధించడంలోనూ భారత పర్యాటకులు కీలక పాత్ర పోషిస్తున్నారు. విదేశీ పర్యాటక స్థలాల సందర్శనకు వెళ్లే భారతీయుల సంఖ్య గత కొన్నేళ్లుగా గణనీయంగా పెరిగింది. పర్యాటక, ఆతిథ్య రంగాన్ని ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న ప్రత్యేక సదస్సులు, ప్రోత్సాహకాలు ఈ రంగం వృద్ధికి దోహదపడుతున్నాయి.