
ఈ వారం ప్రారంభంలో జరిగిన వడోదర రోడ్డు ప్రమాదంపై నటి జాన్వీ కపూర్ రియాక్ట్ అయ్యారు, ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసింది ఈ అందాల భామ. గుజరాత్లోని వడోదరలోని నాగరిక కరేలి బాగ్ ప్రాంతంలో గురువారం రాత్రి వేగంగా వస్తున్న కారు మూడు ద్విచక్ర వాహనాలు, ప్రయాణీకులపైకి దూసుకెళ్లడంతో ఒక మహిళ మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. డ్రైవర్ రక్షిత్ చౌరాసియా, అతని స్నేహితుడు ఫ్రాంషు చౌహాన్ ఇద్దరూ స్టూడెంట్స్ అని తెలుస్తుంది. వీరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ భయంకరమైన యాక్సిడెంట్ పై బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ స్పందించింది. “వేదనకరమైన మరియు భయానకమైన వార్త” అని జాన్వీ కపూర్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ప్రమాదానికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ఇది ఒక భయంకరమైన ప్రమాదం అని, దాని గురించి ఆలోచించగానే తన కడుపు తరుక్కుపోతుందని ఆమె రాసుకొచ్చింది.
సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్న ప్రమాద వీడియోలో, రక్షిత్ చౌరాసియా ప్రమాదం జరిగిన ప్రదేశంలో దెబ్బతిన్న కారు నుండి దిగుతున్నట్లు కనిపిస్తోంది. చౌరాసియా పట్టు నుండి తనను తాను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్న చౌహాన్, ప్రమాదానికి చౌరాసియా కారణం అని చెప్పడం కూడా ఈ వీడియోలో చూడొచ్చు. అయితే చౌరాసియా ఇది మరో రౌండ్ అని పదే పదే అరుస్తూ కేకలేశాడు. అతడు మద్యం మత్తులో కారు నడిపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదం పై పలువురు సెలబ్రేటీలు కూడా స్పందించారు.
జాన్వీ కపూర్ సినిమాల విషయానికొస్తే ఆమె చివరిగా దేవరాలో కనిపించింది. ఇందులో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించింది. త్వరలోనే దేవర 2 షూటింగ్ మొదలుకానుంది. అలాగే సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి పరాణ్ సుందరి చిత్రంలో వరుణ్ ధావన్, నటి సన్యా మల్హోత్రాతో కలిసి సన్నీ సంస్కారి కి తులసి కుమారి చిత్రంలో కూడా నటిస్తుంది. వీటితోపాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఆర్.సి 16 సినిమాలోనూ నటిస్తుంది. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉంది జాన్వీ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి