
మనదేశంలో పర్యటించి, ఇక్కడ అందమైన ప్రదేశాలతో పాటు మన సంస్కృతి, సంప్రదాయలను తెలుసుకుందామని వచ్చిన ఓ ఇజ్రాయెల్ మహిళపై దారుణం జరిగింది. ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు ఆత్యాచారానికి పాల్పడ్డారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం నాడే ఈ ఘటన వెలుగు చూడటంతో దేశం తలదించుకునే పరిస్థితి వచ్చింది. కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం హంపిలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇందులో మరో దారుణం ఏంటంటే.. ఇజ్రాయెల్ మహిళతో పాటు మరో మహిళపై అత్యాచారం చేసి, వారితో పాటు ఉన్న ఓ పర్యాటకుడిని కొట్టి నదిలో పడేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి 11 నుంచి 11:30 గంటల మధ్య గుర్తు తెలియని దుండగులు హంపి సమీపంలోని ప్రసిద్ధ సనపూర్ సరస్సు ఒడ్డున ఉన్న 27 ఏళ్ల ఇజ్రాయెల్ మహిళా పర్యాటకురాలు, 29 ఏళ్ల హోమ్‌స్టే మేనేజర్‌పై అత్యాచారం చేశారు. నేరం జరిగిన సమయంలో వారిద్దరితో పాటు ఉన్న ఒడిశాకు చెందిన ఓ పర్యాటకుడిని కొట్టి తుంగభద్ర కాలువలోకి నెట్టడంతో అతను నదిలో కొట్టుకపోయాడు. అతని ఆచూకీ ఇంకా లభించలేదు. అమెరికా, మహారాష్ట్రకు చెందిన మరో ఇద్దరు పురుష పర్యాటకులు కూడా దుండగుల దాడిలోగాయపడ్డారు. వారి నుంచి ఎలాగోలా ప్రాణాలతో బయటపడిన వారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. నేరం జరిగిన ప్రదేశం హంపి నుండి 4 కి.మీ దూరంలో ఉందని పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతానికి విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. గంగావతి గ్రామీణ పోలీస్ స్టేషన్లో 309 (6), 311, 64, 70 (1), 109 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ ప్రకారం, నలుగురు పర్యాటకులు, వారు బస చేసిన హోమ్‌స్టే మహిళా మేనేజర్ సనపూర్ సరస్సు దగ్గర సంగీతం ప్లే చేస్తూ ఆనందిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.