
ఐపీఎల్ 2025 సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఫామ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కి చేరితే ఈసారి టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. అయితే, తాము హోమ్ గ్రౌండ్ అయిన బెంగళూరులో విజయాలు సాధించకపోతే ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కడం కష్టమేనని కూడా పేర్కొన్నాడు. ఈ సీజన్లో ప్రత్యర్థి వేదికలపై శక్తివంతంగా ఆడుతున్న ఆర్సీబీ, సొంతగడ్డపై మాత్రం నిరాశపరిచే ప్రదర్శన చేస్తోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలవడం దీనికి నిదర్శనం. ఈ రికార్డు మేరకు ఐపీఎల్ చరిత్రలోనే హోమ్ గ్రౌండ్లో అత్యధిక పరాజయాలు చవిచూసిన మొదటి జట్టుగా ఆర్సీబీ చెత్త రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పటివరకు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ 46 మ్యాచ్‌లు ఓడింది. ఇటీవల పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.
ఈ క్రమంలో ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో చతేశ్వర్ పుజారాతో కలిసి పాల్గొన్న అంబటి రాయుడు, ఆర్సీబీ హోమ్ ఫామ్‌పై స్పందించాడు. హోస్ట్ అడిగిన “హోమ్ గ్రౌండ్లో వరుస ఓటములు ఆర్సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బతీస్తాయా?” అనే ప్రశ్నకు పుజారా తేలికగా ‘అలా ఏం జరగదు, ఆర్సీబీ తప్పుల్ని సరిదిద్దుకుంటుంది’ అని స్పందించినా, రాయుడు మాత్రం గట్టిగా వ్యతిరేకాభిప్రాయం వ్యక్తం చేశాడు. హోమ్ మ్యాచులు గెలవకపోతే ప్లే ఆఫ్స్ చేరడం కష్టమేనని స్పష్టంగా పేర్కొన్నాడు. ఎందుకంటే ప్రతిసారీ ప్రత్యర్థుల మైదానాల్లో గెలవడం సాధ్యం కాదని, ఆయా జట్లు కూడా మెరుగైన ప్రదర్శనతో బరిలోకి దిగుతున్నాయని అంబటి వివరించాడు. అయితే, ఒకవేళ ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరినట్లయితే మాత్రం టైటిల్ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని అన్నాడు. ఆ మ్యాచ్‌లు హైదరాబాద్, కోల్‌కతా వంటి న్యూట్రల్ వేదికల్లో జరుగుతాయని, ఇది ఆర్సీబీకి సానుకూలంగా మారవచ్చని విశ్లేషించాడు. దీంతో రాయుడి మాటలు ఆర్సీబీ అభిమానుల్లో కొత్త ఆశలు నింపినట్టయ్యాయి.
అంబటి రాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆర్సీబీ అభిమానులు అతని మాటలను ఆశాజనకంగా చూస్తున్నప్పటికీ, కొంతమంది నెటిజన్లు మాత్రం జట్టు స్థిరత లేకుండా ఆటగాళ్ల ఎంపికలు, మిడ్ ఆర్డర్ వైఫల్యాలు, బౌలింగ్ లైన్అప్ లో అనిశ్చితి వంటి అంశాలను గుర్తుచేస్తూ విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా హోమ్ గ్రౌండ్ అయిన చిన్నస్వామిలో నిలకడలేని ప్రదర్శనపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్లో టైటిల్ గెలవాలంటే కేవలం ప్లే ఆఫ్స్‌కి చేరడమే కాకుండా, నిర్ణయాత్మక దశల్లో సత్తా చాటాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ, ప్లే ఆఫ్స్ వేదికలు న్యూట్రల్ మైదానాల్లో ఉండటంతో ఆర్సీబీకి మళ్ళీ స్థిరంగా ఆడే అవకాశం దక్కుతుందని ఆశలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..