

కాంప్లిమెంటరీ పాసులు.. కాంట్రవర్సీకి కారణమయ్యాయ్. SRH వర్సెస్ HCA అన్నట్లుగా జరుగుతున్న ఫ్రీ పాస్‌ల వివాదం ఎట్టకేలకు క్లోజ్ అయ్యింది. SRH ప్రతినిధులతో భేటీ అయిన HCA సెక్రటరీ దేవరాజ్… కీలక అంశాలను SRH ప్రతినిధుల ముందుపెట్టారు. SRH, HCA, బీసీసీఐ మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందాన్ని పాటించాలన్నారు. రూల్స్ ప్రకారం స్టేడియం సామర్థ్యంలో 10శాతం టికెట్లను HCAకి కేటాయించాలన్నారు. HCA నుంచి SRHకి ఎదురైన సమస్యలను కూడా చర్చలతో పరిష్కరించుకుందామన్నారు. దీంతో HCAకి 3వేల 900 ఫ్రీ పాస్‌లను కేటాయించేందుకు SRH సిద్ధమైంది.
ఫ్రీ పాస్‌ల విషయంలో SRH, HCA మధ్య గతకొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. HCA మీద బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేసింది SRH యాజమాన్యం. ఉచిత పాస్‌ల కోసం వేధిస్తున్నారు… బెదిరింపులకు దిగుతున్నారు.. అంతేకాదు బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నారంటూ HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుపై ఫిర్యాదు చేసింది. టికెట్స్ విషయంలో ఇలానే వేధింపులకు గురిచేస్తే… హైదరాబాద్ వీడి మరో రాష్ట్రాన్ని హోమ్ గ్రౌండ్‌గా ఎంచుకుంటామంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. SRHకి కౌంటర్‌గా HCA సైతం గట్టిగానే వాదించింది. అసలు ఫ్రీపాస్‌ల విషయంలో తామెవరినీ బెదిరించలేదని… ఒప్పందం ప్రకారం టికెట్స్ అడిగితే బ్లాక్మెయిల్ చేసినట్లు ఎలా అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. SRH ప్రతినిధులు HCA ట్రెజరర్ మీటింగ్‌లో పాల్గొన్న తర్వాత బ్లాక్మెయిల్ ఆరోపణలు సరికాదంటూ సమాధానమిచ్చింది.
ఇలా ఇరువర్గాల మధ్య నడుస్తున్న వివాదంపై ఇటు తెలంగాణ ప్రభుత్వం సైతం స్పందించింది. హైదరాబాద్ ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నాలు ఎవరూ చేసినా ఊరుకునే ప్రసక్తేలేదంటూ విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో విచారణ కూడా మొదలైంది. ఉప్పల్ స్టేడియానికి వెళ్లిన అధికారులు… HCA సిబ్బందిని కూడా విచారించారు. SRHతో HCA అధ్యక్షుడు వ్యవహరించిన తీరు, టిక్కెట్ల అమ్మకం, బ్లాక్‌లో టిక్కెట్ల విక్రయాలు, HCA రోజువారీ పరిపాలన వ్యవహారాలపైనా విజిలెన్స్ శాఖ ఆరా తీసింది.
అలా విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుండగానే… చర్చించుకుందాం రండి అంటూ HCAకి SRH మెయిల్ పంపండం.. ఇరువర్గాల ప్రతినిధులు కూర్చుని మాట్లాడుకోవడంతో వివాదానికి ఎండ్ కార్డ్ పడింది. SRH, HCA, బీసీసీఐ మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందాన్ని పాటిస్తూ.. HCAకి 10 శాతం ఫ్రీ పాస్‌లను కేటాయించడంతో గతకొన్ని రోజులుగా నడుస్తున్న కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్ పడింది. అలాగే SRH, HCA ప్రతినిధులు ఇవాళ ప్రభుత్వవర్గాలతో సమావేశమయ్యే అవకాశం ఉంది…! మీటింగ్ సారాంశాన్ని వివరించడంతో పాటు HCAలో తలెత్తుతున్న వివాదాలపైనా మాట్లాడే ఛాన్స్ కనిపిస్తోంది.!