
BCCI Changes Few Things in SRH vs MI Match: మంగళవారం మధ్యాహ్నం, జమ్మూ కాశ్మీర్‌లోని పర్యాటక కేంద్రమైన పహల్గామ్లో ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కాశ్మీర్ సందర్శించడానికి వచ్చిన పర్యాటకులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. 26 మంది మరణించగా, 20 మందికి పైగా గాయపడి ఉంటారని అంచనా. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ దాడికి నిరసనగా నేడు జమ్మూ కాశ్మీర్లో బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ తన సౌదీ అరేబియా పర్యటన నుంచి తిరిగి వచ్చారు. ఈ క్రమంలో, హైదరాబాద్‌లో జరగనున్న IPL 2025 41వ మ్యాచ్‌లో కీలక మార్పులను బీసీసీఐ ప్రకటించింది. ఈ దాడిలో మరణించిన పర్యాటకుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆటగాళ్లతోపాటు అంపైర్లు కూడా నివాళులు అర్పించనున్నారు.
మరణించిన వారికి నివాళులర్పించనున్న క్రీడాకారులు..
పహల్గామ్లో జరిగిన దాడి కారణంగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగే మ్యాచ్‌లో రెండు జట్ల ఆటగాళ్లు నల్లటి బ్యాండ్లు ధరిస్తారు. దీంతో పాటు, మ్యాచ్ ప్రారంభానికి ముందు మృతులకు నివాళులర్పించడానికి ఒక నిమిషం మౌనం కూడా పాటించనున్నారు. మృతుల పట్ల గౌరవంతో, చీర్ లీడర్లు ఈరోజు మ్యాచ్‌లో ప్రదర్శన ఇవ్వరు. అలాగే, నేటి మ్యాచ్ కోసం బాణసంచా కూడా రద్దు చేశారు.
ఇవి కూడా చదవండి
రెండు జట్ల మధ్య హైదరాబాద్‌లో మ్యాచ్..
దాదాపు వారం రోజుల తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మైదానంలోకి అడుగుపెడుతోంది. ఆ జట్టు ఏప్రిల్ 17న వాంఖడేలో ముంబై ఇండియన్స్‌తో తన చివరి మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌లో ముంబై 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఐపీఎల్ 2025 ప్రయాణం హైదరాబాద్‌కు ఏంబాగోలేదు. హైదరాబాద్ ఆడిన 7 మ్యాచ్‌ల్లో కేవలం 2 మాత్రమే గెలిచి 5 ఓడిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ తన సొంత మైదానాన్ని ఉపయోగించుకోవడం ద్వారా ముంబై చేతిలో గతంలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.
మరోవైపు, ముంబై గత మూడు మ్యాచ్‌ల్లో వరుస విజయాలు నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో ముంబై ఆరో స్థానంలో ఉంది. ముంబై 8 మ్యాచ్‌ల్లో 4 గెలిచి, 4 ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ను ఓడించి పాయింట్ల పట్టికలో పైకి దూసుకెళ్లే ఉద్దేశ్యంతో ముంబై ఇప్పుడు మైదానంలోకి దిగుతుంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..