

ఐపీఎల్ 2025లో చాలామంది ప్లేయర్స్ కొత్త జట్లలోకి అడుగుపెట్టారు. జట్టు మారడమే కాదు.. జెర్సీ రంగుతో పాటు ఆడే శైలి కూడా మారిపోయింది. ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్‌లోనే తమ సత్తా చాటారు. గతంలో జట్టులో ఉన్నప్పటికీ జీరోల మాదిరిగా ఉన్న వీళ్లు.. ఇప్పుడు ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించారు. కృనాల్ పాండ్యా, ఇషాన్ కిషన్, నూర్ అహ్మద్ ఈ లిస్టులో ఉన్నారు. ఐపీఎల్ 2025లోని మొదటి 3 మ్యాచ్‌లలో వీరు జీరోల నుంచి హీరోలుగా మారారు. ఈ ముగ్గురు ఆటగాళ్లు గత సీజన్లో వేరే జట్టుతో ఉండగా.. ఐపీఎల్ 18వ సీజన్లో ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, సీఎస్కే తరపున ఆడి అద్భుత విజయాన్ని అందించారు.
అప్పుడు LSG.. ఇప్పుడు RCB..
ఐపీఎల్ 2025 మొదటి మ్యాచ్ KKR, RCB మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. ఇందులో కృనాల్ పాండ్యా బంతితో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన ఇచ్చాడు. KKRపై 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. తద్వారా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. IPL 2024లో LSG తరపున బరిలోకి దిగిన కృనాల్ పాండ్యా.. IPL 2025లో అతడ్ని RCB రూ. 5.75 కోట్లకు కొనుగోలు చేసింది.
ముంబై టూ హైదరాబాద్..
IPL 2025లో రెండో మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో SRH 44 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. సన్‌రైజర్స్ సాధించిన ఈ పెద్ద విజయంలో ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించాడు. కేవలం 45 బంతుల్లో సెంచరీ సాధించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఇది ఐపీఎల్లో ఇషాన్ కిషన్‌కు తొలి సెంచరీ. ఇషాన్ కిషన్ గత సీజన్ వరకు ముంబై ఇండియన్స్‌కి ప్రాతినిధ్యం వహించాడు. కానీ ఐపీఎల్ 2025 మెగా వేలంలో, SRH యజమాని కావ్య మారన్ అతన్ని రూ. 11.25 కోట్లకు కొనుగోలు చేసింది.
గుజరాత్ నుంచి చెన్నైకి..
IPL 2025లో మూడో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో CSK.. MIని 4 వికెట్ల తేడాతో ఓడించింది. తన 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి ముంబై జట్టుపై 4 వికెట్లు పడగొట్టాడు నూర్ అహ్మద్. ఇలా పసుపు జెర్సీలోకి మారాడో.. లేదో.. ఠక్కున జీరో నుంచి హీరోగా మారాడు. నూర్ అహ్మద్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. నూర్ అహ్మద్ గత సీజన్లో ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. అప్పుడు అతన్ని గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత మెగా వేలంలోకి రిలీజ్ చేయగా.. IPL 2025 మెగా వేలంలో CSK నూర్‌ను రూ. 10 కోట్లకు కొనుగోలు చేసింది.