
భారత రైల్వే ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. సరికొత్త రైళ్లను ప్రవేశపెడుతోంది. భారతీయ రైల్వే సంస్థ ఆదాయాన్ని పెంచుకునేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటుంది. అందులో భాగంగానే గూడ్స్ కమ్ ప్యాసింజర్ డబుల్ డెక్కర్ రైళ్లను కూడా ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఈ సరికొత్త ఆలోచనకు ఆమోదం తెలుపడంతో ఇప్పుడు కార్చరూపం దాల్చనుందని తెలుస్తోంది. భారతీయ రైల్వే త్వరలో అలాంటి రైళ్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. అంటే ఈ రైళ్లలో సరుకులు రవాణా చేయడంతోపాటు ప్రయాణికులు కూడా ప్రయాణించవచ్చు. ఈ రైళ్లలో కోచ్‌లు దిగువన లగేజీతో నిండి ఉంటాయి. పైన ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు.
భారత్‌లో ఇప్పటికే డబుల్ డెక్కర్ రైళ్లు నడుస్తున్నాయి. కానీ వాటి సంఖ్య చాలా తక్కువ. అలాగే అవి చాలా తక్కువ మార్గాల్లో నడుస్తాయి. అయితే ఈ డబుల్ డెక్కర్ రైళ్లలో ప్రయాణికులు మాత్రమే ప్రయాణిస్తున్నారు. సరుకు రవాణా లేదు. నివేదికల ప్రకారం.. ప్రారంభ దశలో రెండు రైళ్లను రూపొందించే యోచన ఉంది.
ఇకపై రూపొందే రైళ్లు డబుల్ డెక్కర్ రైళ్లు ఒకేసారి ప్రయాణికులతో పాటు సరుకులను రవాణా చేయనున్నాయి. డబుల్ డెక్కర్ రైళ్లు సరికొత్త రూపం సంతరించుకోనున్నాయి. కోచ్ ల తయారీకి సంబంధించిన ప్రణాళికలు కొనసాగుతున్నాయని రైల్వే అధికారులు తెలిపారు.
ప్రస్తుతం రైల్వే సరకు రవాణా ఆదాయంలో బొగ్గు, ఇనుప ఖనిజం 60 శాతం వాటాను కలిగి ఉంది. 2030 నాటికి 3,000 మిలియన్ టన్నుల కార్గోను రవాణా చేయాలనే దాని ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని చేరుకోవడానికి, పార్శిల్ షిప్మెంట్లతో సహా ఇతర వస్తువులలో వృద్ధిని వేగవంతం చేయాలని మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
ఒక్కో డబుల్ డెక్కర్ కోచ్ ఖర్చు ఎంతో తెలుసా?
ఇదిలా ఉండగా, కపుర్తలాలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఈ రైళ్లకు సంబంధించిన ప్రోటో టైప్ ను డెవలప్ చేస్తున్నారు. సరుకు రవాణాతో పాటు ప్రయాణికులు వెళ్లేలా నిర్మించే ఒక్కో కోచ్ ధర సుమారు రూ. 4 కోట్లుగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 10 కోచ్‌లను తయారు చేసింది. 2023-24లో రైలు సరుకు రవాణా 5 శాతం పెరిగి 1,591 మిలియన్ టన్నులకు చేరుకుందని అధికారులు తెలిపారు. భారతీయ రైల్వే తన సరుకు రవాణా లక్ష్యాలను చేరుకోవడానికి, రవాణా కోసం ముడి పదార్థాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి 2030 నాటికి 10 శాతం వార్షిక వృద్ధి రేటు (CAGR) సాధించాలని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Gold Price: బడ్జెట్ తర్వాత బంగారం ధర పెరగనుందా? గోల్డ్ కొనడం ఇదే సరైన సమయమా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి