
భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. రెండు జట్ల మధ్య బుధవారం కోల్‌కతా వేదికగా తొలి టీ20 జరుగుతుంది. స్వదేశంలో భారత జట్టు ఎప్పుడూ బలమైన ప్రదర్శన అందిస్తుంది. ముఖ్యంగా ఇటీవల టీ20ల్లో భారత జట్టు అద్భుతంగా ఆడుతోంది. అదే సమయంలో 2014 నుంచి ఇంగ్లాండ్ జట్టు ఏ టీ20 సిరీస్‌లోనూ భారత్‌ను ఓడించలేకపోయింది. ఇదిలావుండగా, ఈసారి తమ జట్టు భారత్‌ను 3-2తో ఓడిస్తుందని ఇంగ్లాండ్ వెటరన్ క్రికెటర్ మైకేల్ వాన్ జోస్యం చెప్పాడు.
ఇంగ్లాండ్ జట్టు భారత్‌తో వరుసగా నాలుగు టీ20 సిరీస్‌లను కోల్పోయింది. టీ20 ప్రపంచకప్ 2024 సెమీఫైనల్లో ఇరు జట్ల మధ్య చివరి టీ20 మ్యాచ్ జరగ్గా.. ఇందులోనూ భారత్ విజయం సాధించింది. ఇక ఇన్ని పరాభవాలకు జోస్ బట్లర్ ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడుతున్నాడు. ఈ నేపధ్యంలో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ టీ20 సిరీస్‌పై తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఇంగ్లాండ్ జట్టు 3-2తో సిరీస్ కైవసం చేసుకుంటుందని.. సుమారు 11 ఏళ్ల తర్వాత భారత్ ఓటమిని చవిచూడాల్సి వస్తుందని తెలిపాడు.
టీ20లలో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు మొత్తం 24 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 13 మ్యాచ్‌లు గెలుపొందగా, ఇంగ్లాండ్ 11 మ్యాచ్‌లు గెలిచింది. 2014లో స్వదేశంలో జరిగిన 1 మ్యాచ్ టీ20 సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టు భారత్‌ను ఓడించింది. ఆ తర్వాత భారత్ వరుసగా నాలుగు సిరీస్‌లను గెలుచుకుంది. వాటిలో రెండు ఇంగ్లాండ్ స్వదేశంలో జరిగాయి. ఇరు జట్ల మధ్య జరిగిన చివరి 5 మ్యాచ్‌ల్లో భారత్ 3 గెలిచింది. ఇక కోల్‌కతాలో భారత్ 7 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడగా, అందులో 6 గెలిచింది. ఒకదానిలో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇదేకాదు స్వదేశంలో జరిగిన టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో భారత్‌కు 68.90 విజయశాతం ఉంది. ఇదే అత్యధికం.
England will win 3-2 https://t.co/rldOScutYz
— Michael Vaughan (@MichaelVaughan) January 22, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి