

ఇటీవల వెల్లడైన ఓ నివేదిక ప్రకారం మార్చి 2025తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆపిల్ భారతదేశంలో తన ఐఫోన్ ఉత్పత్తిని 22 బిలియన్ల డాలర్లకు పెంచింది. ఇది గత సంవత్సరం కంటే 60 శాతం ఎక్కువ. కుపెర్టినో దిగ్గజం ఇప్పుడు భారతదేశంలో ఐదు ఐఫోన్లను తయారు చేస్తోంది. ముఖ్యంగా చైనాలో తయారు చేయడం కంటే ఐఫోన్ల ఉత్పత్తికి భారత్ బెస్ట్ అని భావిస్తుంది. ఇటీవల కాలంలో సుమారు 17.4 బిలియన్ల డాలర్ల విలువైన ఐఫోన్లు దేశం నుంచి ఎగుమతి చేశారు. ముఖ్యంగా కోవిడ్ లాక్డౌన్ల కారణంగా చైనాలో ఏర్పడిన అంతరాయాల నేపథ్యంలో ఇతర దేశాల్లో ఐఫోన్ల ఉత్పత్తికి ఆపిల్ సిద్ధపడింది. ఈ నేపథ్యంలో భారత్ ఏ బెస్ట్ అని భావించి ఇక్కడ ఉత్పత్తిని పెంచుతుంది. దక్షిణ భారతదేశంలోని ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్‌నకు సంబంధించిన ఫ్యాక్టరీ ఇప్పుడు భారతీయ ఐఫోన్ అసెంబ్లీలో ఎక్కువ భాగాన్ని నిర్వహిస్తుంది.
ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ “పరస్పర” సుంకాలను విధించే ప్రణాళికలను ప్రకటించిన తర్వాత అమెరికాకు భారతదేశంలో తయారు చేసిన ఐఫోన్ల ఎగుమతులు వేగవంతమయ్యాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ట్రంప్ ప్రభుత్వం ఇటీవల స్మార్ట్ ఫోన్స్‌తో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులను ఈ సుంకాల నుండి మినహాయించింది. ఈ చర్యలు ఆపిల్‌కు తాత్కాలిక ఉపశమనం కలిగించింది. అయితేఈ మినహాయింపు శాశ్వతం కాదు. అలాగే చైనీస్ వస్తువులపై ప్రత్యేక 20 శాతం సుంకం అమలులో ఉంది. అందువల్ల ఆపిల్ సంస్థ ఇతర దేశాల్లో ఐఫోన్ల ఉత్పత్తిని పెంచింది. అయితే ఆపిల్ ఉత్పత్తి సామర్థ్యంలో కేవలం 10 శాతం మాత్రమే చైనా నుంచి మార్చడానికి ఎనిమిది సంవత్సరాలు పట్టవచ్చు.
భారతదేశం ఇప్పుడు ఆపిల్‌కు పూర్తి ఐఫోన్ శ్రేణిని ఉత్పత్తి చేస్తుంది. వీటిలో ప్రీమియం టైటానియం ప్రో మోడల్స్ ఉన్నాయి. భారతదేశాన్ని తయారీ కేంద్రంగా మార్చాలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దార్శనికతకు సంబంధించిన రాష్ట్ర సబ్సిడీలు తయారీ విస్తరణకు మద్దతు ఇచ్చాయి. మోడీ 2.7 బిలియన్ల డాలర్ల కొత్త ఆర్థిక ప్రోత్సాహకాలతో ఎలక్ట్రానిక్స్ భాగాల తయారీని మరింత పెంచుతున్నారు. ఆపిల్ ప్రస్తుతం భారతదేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దాదాపు 8 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు దాదాపు 8 బిలియన్ల డాలర్లకు చేరుకున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి