
Rajiv Gandhi International Airport (RGIA): హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇటీవల ప్రయాణికుల రాకపోకలలో ఆశ్చర్యకరమైన వృద్ధిని నమోదు చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో విమానాశ్రయం 15.20 శాతం వృద్ధితో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 2.13 కోట్ల మంది ప్రయాణికులు ఈ ఏడాది RGIA విమానాశ్రయం ద్వారా ప్రయాణించడం గమనార్హం. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇదే రీతిలో రద్దీ కొనసాగితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో మూడు కోట్ల మార్కును దాటి మరిన్ని రికార్డులు నెలకొల్పే అవకాశముందని అంచనా..
చివరి మూడు నెలల్లో రికార్డు స్థాయి రద్దీ
ప్రత్యేకంగా 2024 సంవత్సరంలో జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో విమానాశ్రయం 74 లక్షల ప్రయాణికులతో గత మూడు నెలల కాలంలోనే చరిత్ర సృష్టించింది. సాధారణంగా నెలకు 20 లక్షల మంది ప్రయాణికులు ఈ విమానాశ్రయం ద్వారా ప్రయాణిస్తారు.. ఈ సమయంలో గణనీయంగా పెరిగిన రద్దీతో ఇతర మెట్రో నగరాలైన చెన్నై, కోల్‌కతాలను అధిగమించింది. జనవరి 18న ఒక్క రోజే 94 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించడం మరింత విశేషం.
ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ ముందు వరుసలో..
2023-24లో దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రధాన విమానాశ్రయాలతో పోలిస్తే హైదరాబాద్ అధిక వృద్ధిని సాధించింది. బెంగళూరు 11.40 శాతం, కోల్‌కతా 9.60 శాతం, దిల్లీ 7.60 శాతం, ముంబయి 5.10 శాతం వృద్ధిని నమోదు చేసినప్పటికీ.. హైదరాబాద్ 15.20 శాతం వృద్ధితో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇది నగరంలో జరుగుతున్న జాతీయ, అంతర్జాతీయ సదస్సులు.. ఇతర రాష్ట్రాల నుండి విదేశీ ప్రయాణాల కోసం హైదరాబాద్ ను ఎంచుకునే ప్రయాణికుల పెరుగుదల వంటివి ప్రధాన కారణాలుగా పేర్కొనవచ్చు.
విదేశీ గమ్యస్థానాలకు అధిక ప్రయాణాలు..
రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుంచి విదేశాలకు కూడా భారీగా ప్రయాణాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా దుబాయ్‌కు నెలకు 93 వేల మంది ప్రయాణిస్తుండగా, దోహా 42 వేల మంది, అబుధాబీ 38 వేల మంది, జెడ్డా, సింగపూర్‌కు తలా 31 వేల మంది ప్రయాణిస్తున్నారు. ఈ గమ్యస్థానాల వైపు ప్రయాణాల సంఖ్య ఎక్కువగా ఉండటం, హైదరాబాద్ అంతర్జాతీయ ప్రయాణాలకు కీలక కేంద్రంగా మారుతున్నదాన్ని సూచిస్తోంది.
మొత్తంగా, శంషాబాద్ విమానాశ్రయం దేశవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానాశ్రయంగా ఎదుగుతోంది. ప్రయాణికుల సంఖ్యలో ఈ వృద్ధి ట్రెండ్ కొనసాగితే, త్వరలోనే ఇది అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రముఖత సాధించనున్నదని విమానాశ్రయ అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..