

తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. 12805,12806 నెంబర్ గల జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు ఇకపై సికింద్రాబాద్, బేగంపేట స్టేషన్లలో హాల్ట్ ఉండదు. ఏప్రిల్ 25 నుంచి ఈ మార్పు అమల్లోకి రానుంది. జన్మభూమి ఎక్స్ప్రెస్ను చర్లపల్లి-అమ్ముగూడ-సనత్నగర్ మార్గంగా మళ్లించారు. గతంలో జన్మభూమి ఎక్స్ప్రెస్ లింగంపల్లి – విశాఖపట్నం మధ్య పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ రైలు నిత్యం ప్రయాణికులతో రద్దీగా కనిపిస్తుంటుంది. పండుగల సమయాల్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
చర్లపల్లి రైల్వే స్టేషన్ అందుబాటులోకి రావటంతో సికింద్రాబాద్ కు రాకపోకలు సాగించే ప్రధాన రైళ్ల రాకపోకల్లో మార్పులు చేశారు. అందులో భాగంగా విశాఖ, చెన్నై నుంచి పలు రైళ్లల్లో కొత్త నిర్ణయాలు అమల్లోకి తెస్తున్నారు. అయితే ఏప్రిల్ 25 నుంచి రైలు నెంబర్ 12805 విశాఖపట్నం-లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్ చర్లపల్లి మీదుగా నడుస్తుంది. ఉదయం 6.20 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరనున్న రైలు… సాయంత్రం 6.05 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ఐదు నిమిషాల పాటు చర్లపల్లిలో హాల్టింగ్ ఉంటుంది. తర్వాత సాయత్రం 6.10 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి అమ్ముగూడ మీదుగా రాత్రి 7.40 గంటలకు లింగంపల్లికి చేరుకుంటుంది. రైల్వే సమయాలు మార్చకపోయినప్పటికీ, ప్రయాణించే మార్గంలో మార్పులు ఉన్నందున ముందస్తుగా ప్లాన్ చేసుకోవడం మంచిది. దక్షిణ మధ్య రైల్వే ప్రకారం, ఈ మార్పు శాశ్వత ప్రాతిపదికన అమలులోకి వస్తుంది. అయితే, ఇతర స్టేషన్ల హాల్టింగ్, సమయాల్లో ఎటువంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.