

హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో బాదుడే బాదుడు ఏ స్థాయిలో ఉందో ఓసారి తెలుసుకుందాం….
1) — టూవీలర్ 2 గంటల వరకు 10 రూపాయల చార్జ్ చేస్తున్నారు. మరో గంట ఎక్కువైతే 5 రూపాయలు ఎక్కువ వసూలు చేస్తారు. 3-4 గంటలు పార్కింగ్ చేస్తే 20 రూపాయలు.. 4 నుంచి 12 గంటలు టూవీలర్ పార్క్ చేస్తే 25 రూపాయలు తీసుకుంటారు.
2) — కారు పార్కింగ్ ఫీజు గంటకు 30 రూపాయలు…. 3 గంటలకు 45.. నాలుగు గంటలకు 60 రూపాయలు.. 12 గంటలైతే ఏకంగా 75 రూపాయలు వసూలు చేస్తున్నారు.
3) — మంత్లీ ఆఫర్ పేరుతో డిస్కౌంట్లు ఇస్తున్నారు. కానీ వాహనానికి ఏమైనా మా బాధ్యత లేదని చేతులు దులుపుకుంటున్నారు. ఇదీ హైదరాబాద్ మెట్రో సంగతి…
మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కనీసం షెడ్డు కూడా ఏర్పాటు చేయలేదు. కానీ చార్జీల రూపంలో భారీగా వసూళ్లకి ఎగబడుతున్నారు. ప్యాసింజర్ల వాహనాల రక్షణకు దిక్కులేదు. కానీ పార్కింగ్ ఫీజులను తెలిపే డిస్ప్లే బోర్డ్లు మాత్రం కలర్ఫుల్గా ఏర్పాటు చేశారు. రెండు మూడు మీటర్ల దూరానికో బోర్డ్.. అది కూడా లెఫ్ట్, రైట్ సైడ్లో అరెంజ్ చేశారు. వీటిపై ఉన్న శ్రద్దలో కొంతైనా కనీస సౌకర్యాల విషయలో చూపిస్తే బాగుంటుందంటున్నారు వాహనదారులు.
ఛార్జీలు భరిస్తున్నాం.. కానీ ఎండకు తమ వాహనాలు ఎక్కడ తగలబడితే పోతాయోనని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. మియాపూర్ టు అమీర్పేట్ వెళ్లాలంటే దాదాపు 40 రూపాయల ఛార్జ్ ఉంటుంది. కానీ పార్కింగ్ చార్జ్ అంతకన్నా ఎక్కువ చెల్లించాల్సి వస్తుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే తక్కువ జీతాలతో నెట్టుకొస్తున్నాం. ఈ బాదుడు మోత ఏంటని గగ్గోలు పెడుతున్నారు.
పార్కింగ్ ఫీజుకి తోడు ఈ మధ్య కొత్తగా చెక్ ఇన్.. చెక్ ఔట్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఇది కూడా బాదుడే బాదుడులో ఓ భాగం. వాహనం లోపలికి వెళ్లేప్పుడు చెక్ ఇన్ కావాలి.. బయటకు వెళ్లేప్పుడు చెక్ ఔట్ కావాలి.. ఒకవేళ చెక్ ఔట్ మర్చిపోతే అంతే సంగతులు. గంట గంటకు చార్జీ వసూలు చేస్తారు.
మొదట్లో ఫ్రీ పార్కింగ్ అన్నారు. ఆ తర్వాత చార్జీలు షురూ చేశారు. ఇప్పుడు అడిగినంత ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలాగే కొనసాగితే వాహనదారులు మెట్రో ఎక్కే పరిస్థితి ఉంటుందా? కనీస వసతులు కల్పించకుండా ఛార్జీలేంటన్నది వాహనదారుల నుంచి వస్తున్న ప్రశ్న. హైదరాబాద్ మెట్రో ఇప్పటికైనా పార్కింగ్ చార్జీలు తగ్గిస్తుందా ? వాహనదారులు రిలీఫ్ అయ్యే చర్యలు చేపడుతుందా చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..