
బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాపై ఈడీ అధికారులు దూకుడు పెంచారు. కొద్ది రోజుల క్రితం బండ్లగూడలో నమోదైన కేసులో ఆస్తులను అటాచ్ చేశారు. తాజాగా ఈ అక్రమ రవాణా రాకెట్ కేసులకు సంబంధించి హైదరాబాద్ జోనల్ ఆఫీస్‌లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) 1.90 లక్షల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. బ్యూటిషన్, టైలరింగ్ ఇలా వివిధ వృత్తుల పేరుతో బంగ్లాదేశ్ యువతులను హైదరాబాద్ రప్పించిన ముఠాలు.. వారితో వ్యభిచారం చేయించారు. కొద్దిరోజుల క్రితం పోలీసులు రైడ్ చేయడంతో అసలు విషయం బయటపడింది. బంగ్లాదేశ్ నుంచి మహిళల అక్రమ రవాణా చేసినట్లు తేలింది. తాజాగా ఖైరతాబాద్, సనత్ నగర్, చాదర్ ఘాట్ లో మూడు కేసులు నమోదు చేశారు. 20 మంది బంగ్లాదేశ్ యువతులను అరెస్టు చేశారు పోలీసులు.
ఉద్యోగాలు కల్పిస్తామని ఆశచూపి బంగ్లాదేశ్ యువతులను భారత్‌లోకి ఏజెంట్లు అక్రమంగా రవాణా చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వారితో బలవంతంగా వ్యభిచారంలోకి దింపారు. వ్యభిచారం ద్వారా సంపాదించిన డబ్బును నిందితులు పలు మార్గాల్లో బంగ్లాదేశ్‌కు తరలిస్తున్నట్టు ఎన్ఐఏ గుర్తించింది. దీంతో మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేసింది. బంగ్లా యువకులు ఓలా, ఉబర్ డ్రైవర్లుగా పని చేస్తూ అమ్మాయిలను చెర వేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వీరంతా ఇండియాకు వచ్చి ఆధార్ కార్డులను సంపాదించి భారత పౌరులుగా చలామణి అవుతున్నట్లు గుర్తించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..