

ఇల్లు తన పేరుతో రాయడం లేదన్న కక్షతో పెద్ద కొడుకు కన్నతల్లినే చంపేశాడు. పిల్లలు చిన్నవయస్సులో ఉన్నప్పుడే తండ్రి చనిపోతే.. తల్లి పెంచి ఇంతవాళ్లను చేసిందన్న సోయి కూడా లేదు వాడికి. తల్లిని కర్రతో కొట్టి.. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లాక.. గ్యాస్ సిలిండర్ ఎత్తి మీద వేశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యానికి బానిసయ్యి నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు.
రాచమల్ల రత్నం, చంద్రకళ(55) దంపతుల సిద్ధాంతి ప్రాంతానికి చెందినవారు. వీరికి ప్రకాష్, రఘునందన్.. ఇద్దరు కుమారులు ఉన్నారు. 25 ఏళ్ల క్రితం రత్నం చనిపోయాడు. చంద్రకళ రోజు కూలికి వెళ్తూ పిల్లల్ని పెంచి పెద్దోళ్లను చేసింది. పెద్ద కుమారుడు ప్రకాశ్‌కు పెళ్లి కూడా చేసింది. తన కష్టార్జితంతో రాళ్లగూడలో 70 చదరపు గజాల స్థలాన్ని కొని జీ+1 ఇల్లు కూడా కట్టించింది
ప్రకాశ్ తన భార్యతో కింద పోర్షన్లో నివాసం ఉంటున్నాడు.. తల్లి చంద్రకళ, చిన్న కొడుకుతో కలిసి పైన ఉంటోంది. ప్రకాష్ కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. జల్సాలు కూడా ఎక్కువయ్యాయి. మద్యానికి డబ్బు ఇవ్వాలని తల్లిని వేదించేవాడు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు వస్తువులు ఎత్తుకెళ్లేవాడు. ఈ క్రమంలోనే తల్లి తనకు కాకుండా తమ్ముడి పేరిట ఇల్లు రాస్తుందేమో అని ప్రకాశ్ అనుమానం పెంచుకున్నాడు. బుధవారం సాయంత్రం తమ్ముడు ఇంట్లో లేని సమయంలో ప్రకాశ్ డబ్బులు ఇవ్వాలని తల్లితో గొడవ పడ్డాడు. ఆ ఘర్షణలో కర్రతో తలమీద కొట్టడంతో తల్లి స్పృహ తప్పి కింద పడిపోయింది. అంతటితో ఆగలేదు దుర్మార్గుడు. గ్యాస్ సిలిండర్‌ను పలుమార్లు ఆమెపై బలంగా వేశాడు. ఆమె చనిపోయాక.. పక్కకు రాగి రక్తాన్ని శుభ్రం చేశాడు. రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చిన సోదరుడు రఘునందన్ తల్లిని అలా చూసి నిర్ఘాంతపోయాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు నిందితుడు ప్రకాశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..