

హైదరాబాద్, ఏప్రిల్ 6: వారిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇటీవల భార్య గర్భం దాల్చడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకువచ్చాడు భర్త. కానీ ఏం జరిగిందో తెలియదుగానీ ఇద్దరు వాదులాడుకున్నారు. అనంతరం కోపంతో ఊగిపోయిన భర్త నడిరోడ్డుపై బండరాయితో మోదీ గర్భవతైన భార్యను హత్య చేసేందుకు యత్నించాడు. పలుమార్లు బండరాయితో మోదడంతో తీవ్ర గాయాలపాలైన మహిళ కదలకుండా పడిపోవడంతో చనిపోయి ఉంటుందని భర్త అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన మహిళను చుట్టుపక్కల వారు రక్షించి ఆస్పత్రికి తరలించారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆమెను ఎందుకంత క్రూరంగా దాడి చేశాడో ఎవరికీ తెలియరాకుంది. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని కొండాపూర్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం..
వికారాబాద్‌కు చెందిన ఎండి బస్రత్ (32) ఉపాధి కోసం సిటీకి వచ్చి హఫీజ్ పేట్ పరిధిలోని ఆదిత్యనగర్‌లో నివాసం ఉంటున్నాడు. 2023 జనవరిలో అజ్మీర్ దర్గాకు వెళ్తుండగా బస్రత్‌కు కోల్‌కతాకు చెందిన షబానా పర్వీన్ (22) పరిచయమైంది. వీరి పరిచయం కాస్తా అనతి కాలంలోనే ప్రేమగా మారింది. దీంతో వీరిద్దరూ 2024 అక్టోబర్‌లో పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఈ జంట హఫీజ్ పేట్ ఆదిత్యనగర్‌లో కాపురం పెట్టారు. బస్రత్ ఇంటీరియర్ డిజైన్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. పెళ్లి అనంతరం తొలినాళ్లలో అత్తామామల వద్ద ఉండగా కలహాలు ఏర్పడ్డాయి. దీంతో బస్రత్, షబానా పర్వీన్‌లు పక్కనే ఇల్లు తీసుకుని వేరు కాపురం పెట్టారు. ఈ క్రమంలో షబానా గర్భం దాల్చింది. రెండు నెలల గర్భిణిగా ఉన్న పర్వీన్‌కు వాంతులు కావడంతో మార్చి 29వ తేదీన కొండాపూర్ రాఘవేంద్రకాలనీలోని సియా లైఫ్ ఆసుపత్రిలో చేర్పించాడు బస్రత్.
రెండు రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తరువాత పర్వీన్‌ను ఏప్రిల్ 1వ తేదీన రాత్రి డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రి బయటకు వస్తున్న ఈ జంట హాస్పిటల్ ముందే గొడవపడ్డారు. వివాదం ముదరడంతో బస్రత్ కోపంతో భార్య పర్వీన్‌పై దాడి చేశాడు. నడిరోడ్డుపై కిందపడి పెనుగులాడుతున్న కమ్రంలో అక్కడే ఉన్న బండరాయితో ఆమెపై దాడి చేశాడు. దాదాపు 10 నుంచి 12సార్లు రాయితో మోదడంతో పర్వీన్‌కు తీవ్రగాయాలై అపస్మారక స్థితికి వెళ్లింది. ఆమె చనిపోయిందని భావించిన బస్రత్ అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గచ్చిబౌలి పోలీసులు కొన ఊపిరితో ఉన్న పర్వీన్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోమాలో ఉంది. పర్వీన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బస్రత్ను ఏప్రిల్ 3న అరెస్టు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.