
బెట్టింగ్ యాప్స్ కారణంగా యువకులు, టీనేజర్స్.. పెద్ద మొత్తంలో నష్టపోయి.. చివరికి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. దీంతో ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వరుస ఘటనలు ఆందోళన కల్గిస్తున్నాయి. దీంతో బెట్టింగ్ యాప్స్ వివాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయ అంశంగా మారింది. నెటిజన్లంతా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్‌పై పోరుబాట పడుతున్నారు. ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ కూడా ఇందులో భాగస్వాములయ్యారు.
బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న వారిని ఇప్పుడు కేసులు వెంటాడుతున్నాయి. లోకల్‌బాయ్ నానీ, బయ్యా సన్నీ యాదవ్.. హర్షసాయిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నందుకు కేసు నమోదు చేసినట్లు సైబరాబాద్ పోలీసులు ప్రకటించారు. సజ్జనార్ పోస్టులతో.. ఇప్పటికే వైజాగ్ లోకల్ బాయ్ నానిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. మరో యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ మీద కూడా కేసు నమోదు చేశారు. తాజాగా మరో 11 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు. విష్ణుప్రియ, సుప్రీత, రీతూ చౌదరి, హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ వంటి పులువురిపై కేసులు నమోదయ్యాయి.
బెట్టింగ్ యాప్‌లతో ఎంతోమంది యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారంటూ సజ్జనార్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కోట్లలో సంపాదించి.. వేలల్లో పంచుతూ సంఘ సేవ చేస్తున్నట్లు పోజులు కొడుతున్న ఇలాంటి వారినా మీరు ఫాలో అవుతుంది అంటూ ప్రశ్నించారు. బెట్టింగ్ అనేది సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని… భారత ఆర్ధిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తోందన్నారు సజ్జనార్. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సైబర్ టెర్రరిస్టులను అన్ ఫాలో కొట్టండి.. వారి అకౌంట్లను రిపోర్ట్ చేయండంటూ ట్వీట్ చేశారు సజ్జనార్.
బెట్టింగ్ యాప్సే పెద్ద మోసం. దీనికి తోడు కొంత మంది అదే పనిగా ప్రమోట్ చేస్తుండటంతో ఈ యాప్‌లలో ఇన్వెస్ట్ చేసి మోసపోతున్నారు జనం. అందుకే పోలీసులు ఓ వైపు వారిపై కేసులు పెడుతూనే.. బెట్టింగ్ యాప్స్‌తో ఉన్న ప్రమాదంపై అప్రమత్తం చేస్తున్నారు.