
భద్రం బీ కేర్ ఫుల్. ఈ హెచ్చరిక హైదరాబాద్ నగరంలోని దుస్తులు షాపుల వాళ్లకు ఇస్తున్నాం. నగరంలో కొంతమంది మహిళలు చొరబడ్డారు. వారు షాపుల్లో చీరల దోపిడీలకు పాల్పడుతున్నారు. వీరి లక్ష్యం.. చీరలు మాత్రమే. అలా అని యజమానులు, సిబ్బందులకు ఎలాంటి హాని కూడా తలపెట్టరు. వారికి మాటలు చెబుతూ ఏ మాత్రం అనుమానం రాకుండా.. అక్కడి చీరలు సర్దేస్తున్నారు. డైవర్డ్ చేసి మాయ చేసి సరుకు దోచుకు వెళ్లిపోతారు. ఆ చీరను బయటకు తక్కువ రేట్లకు అమ్మి నగదు అర్జిస్తున్నారు. ఆ తర్వాత పాప పరిహారం కోసం యాదగిరి గుట్ట వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుంటారు. తాజాగా వీరిలో కొందరిని మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించిన అనంతరం వివరాలను ఏసీపీ శ్రీనివాస్ మీడియాకు తెలిపారు.
ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన 50 నుంచి 60 మందితో కూడిన ఒక ముఠా హైదరాబాద్లో చీరల దొంగతనాలకు పాల్పడుతోందని ఏసీపీ శ్రీనివాస్ కుమార్ చెప్పారు. వీరు చీరల దొంగతనాలనే వృత్తిగా మార్చుకున్నట్లు వెల్లడించారు. ఈ ముఠాలోని సభ్యులు ఐదుగురు, ఆరుగురు సభ్యులుగా నగరంలో దొంగతనాలకు పాల్పడుతున్నారని వివరించారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్, మియాపూర్, మధురానగర్, సైఫాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ ముఠా సభ్యులపై 10 నుంచి 15 వరకు కేసులు ఉన్నాయన్నారు. ‘ఒక షాపులో చోరీ చేసేముందు ఇన్నోవా వాహనంలో వెళ్లి రెక్కీ చేస్తారు. దొంగతనం చేయగానే యాదగిరి గుట్టకు వెళ్లి దర్శనం తర్వాత మళ్లీ తిరిగి వచ్చి దొంగతనాలు కొనసాగిస్తారు. వీరిలోకొందరు అరెస్ట్ అయి..జైలుకు వెళ్లి వచ్చినా ప్రరవర్తన మార్చుకోవడం లేద’ని ఏసీపీ చెప్పారు. తాజాగా ఈ కేసులకు సంబంధించి ఏడుగురు నిందితులను అరెస్టు చేసి.. రెండు లక్షల రూపాయల విలువైన చీరలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి.