
గృహ రుణం అనేది కొనుగోలుదారులు తమ కలను నెరవేర్చుకోవడంలో చాలా సాయం చేస్తుంది. ముఖ్యంగా మీరు ఆదాయపు పన్ను మినహాయింపులను పొందడానికి గృహ రుణం అనేది కీలక వనరుగా పని చేస్తుంది. ప్రతి సంవత్సరం గణనీయంగా ఆదాయపు పన్నును ఆదా చేయడంలో సహాయపడుతుంది. పాత పన్ను విధానంలో ఉన్న పన్ను చెల్లింపుదారులు గృహ రుణంలో చెల్లించే వడ్డీ, అసలుపై పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. గృహ రుణం చెల్లింపు అనేది దీర్ఘకాలికంగా ఉంటుంది కాబట్టి రుణ వ్యవధిలో గణనీయమైన పన్ను ఆదా చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24(బి) ప్రకారం చెల్లించిన వడ్డీపై ఒక పన్ను చెల్లింపుదారుడు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 2 లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ మినహాయింపు ఇంటిని కొనుగోలు చేయడానికి లేదా నిర్మించడానికి వర్తిస్తుంది. ఇది రుణం మంజూరు చేసిన ఆర్థిక సంవత్సరం చివరి నుండి ఐదు సంవత్సరాలలోపు పూర్తి చేయాలి.
అలాగే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీ ప్రకారం పాత పన్ను విధానాన్ని అనుసరించే పన్ను చెల్లింపుదారుడు చెల్లించిన అసలుపై ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. అయితే పన్ను చెల్లింపుదారుడు ఆస్తిని స్వాధీనం చేసుకుని 5 సంవత్సరాలు పూర్తయ్యేలోపు విక్రయించకపోతే ఇది వర్తిస్తుంది. ఇంటి కొనుగోలు కోసం ఖర్చు చేసిన ఆర్థిక సంవత్సరంలోనే ఇంటి కొనుగోలుదారుడు స్టాంప్ డ్యూటీ కింద రూ. 1.50 లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే సెక్షన్ 80 ఈఈ ద్వారా 35 లక్షల వరకు రుణం తీసుకుని ఇంటి విలువ 50 లక్షల వరకు ఉంటే, ఒక ఆర్థిక సంవత్సరంలో 50,000 రూపాయల వరకు పన్ను ప్రయోజనం పొందవచ్చు. సెక్షన్ 80 ఈఈఏ ద్వారా 45 లక్షల స్టాంప్ విలువ కలిగిన ఆస్తికి పన్ను చెల్లింపుదారుడు రూ. 1.50 లక్షల వరకు పన్ను ప్రయోజనం పొందవచ్చు.
సాధారణంగా 9.5 శాతం వడ్డీ రేటుతో 25 సంవత్సరాల పాటు తీసుకున్న రూ.60 లక్షల ఇంటి రుణం తీసుకుంటే రుణంపై ఈఎంఐ రూ. 52,422 అవుతుంది. అంటే వడ్డీ దాదాపు రూ. 97,26,540గా ఉంటుంది. రుణం వ్యవధి పూర్తయ్యే సరికి రూ.1,57,26,540 చెల్లిస్తాం. అయితే మీకు సెక్షన్ 80సీ కింద మీకు వేరే మినహాయింపు లేకపోతే, మీరు చెల్లించిన అసలుపై ప్రతి సంవత్సరం రూ. 1.50 లక్షల వరకు ఆదా చేయవచ్చు. వడ్డీ విషయానికొస్తే, పన్ను చెల్లింపుదారుడు ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే ఆర్థిక సంవత్సరంలో రూ. 2 లక్షల వరకు ఆదా చేయవచ్చు.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి