

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం తొమ్మిది దాటితే చాలు.. ఎండవేడిమికి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. రెండు రాష్ట్రాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. ఒకవైపు ఎండవేడిమి, మరోవైపు ఉక్కపోతతో చుక్కలు చూస్తున్నారు. అత్యవసర పనుల కోసం బయటకు వచ్చేవారు.. వేడి గాలులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తర తెలంగాణలో ఎండలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాలో..అరెంజ్..అలెర్ట్ ఇచ్చారు. ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. చాలా మంది వడ దెబ్బకు గురవుతున్నారు. ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.
ఆదివారం గరిష్టంగా ఆదిలాబాద్లో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు వాతావరణ అధికారులు. నల్లగొండ జిల్లాలో కనిష్ఠంగా 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. వచ్చే రెండ్రోజులు మూడు నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే చాన్స్ ఉందని చెప్పారు. ఆదిలాబాద్, కొమురం భీమ్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ఒకటి రెండు జిల్లాలు మినహా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో సాధారణం కంటే 2 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నారు. ఈ నెల 19, 20న ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు.
ఏపీలోనూ ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే సుర్రుమంటున్న సూరీడు.. మధ్యాహ్నం అయ్యేసరికి నిప్పులు కక్కుతున్నాడు. రాష్టవ్య్రాప్తంగా 41 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. 185 మండలాలకు వడగాలుల హెచ్చరికలు జారీ చేశారు వాతావరణం శాఖ అధికారులు. 34 మండలాలకు రెడ్ అలర్ట్, మరో 171 మండలాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో 8, విజయనగరం జిల్లా 15, పార్వతీపురం మన్యం జిల్లాలో 12 మండలాలకు తీవ్ర వడగాల్పుల హెచ్చరికలు జారీ చేశారు. 167 మండలాల్లో వడగాల్పుల అవకాశం ఉందన్నారు. రేపు 25 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 89 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు వాతావరణ అధికారులు. ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని.. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.