
హైదరాబాద్, మార్చి 2: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలకు రాష్ట్ర సర్కార్ కీలక ప్రకటన జారీ చేసింది. రంజాన్ ప్రారంభ నేపథ్యంలో ఉర్దూ విద్యార్థులకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా బడి పిల్లలకు మార్చి 15వ తేదీ నుంచి యేటా ఒంటి పూట బడులు ఇస్తుంటారు. అయితే ఈసారి మాత్రం కాస్తముందుగానే ప్రభుత్వం ఒంటి పూట బడులు ప్రకటించింది. దీంతో మార్చి 3వ తేదీ నుంచే ఒంటి పూట బడులు ప్రారంభమవుతున్నాయి. ఏప్రిల్ 1 వరకు ఉర్దూ విద్యార్థులకు ఒంటి పూట బడులు నిర్వహించనున్నట్టుగా సర్కార్ ఉత్తర్వుల్లో తెలిపింది. దీంతో విద్యార్ధులకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పిల్లలకు తరగతులు నిర్వహించనున్నారు. ఉర్దూ మీడియం పాఠశాలలు, ఇతర పాఠశాలలోని ఉర్దూ మీడియం విభాగాలు, DIET కాలేజీల్లోని ఉర్దూ మీడియం విభాగాలకు తాజా ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి.
మరోవైపు రంజాన్ మాసం సందర్భంగా మార్చి 2వ తేదీ నుంచి 31 వరకు షాప్లు 24 గంటలు తెరిచి ఉంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ముస్లిం ఉద్యోగులు పనివేళలను ఒక గంట తగ్గిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులు ఒక గంట ముందుగానే కార్యాలయాలు, పాఠశాలల నుంచి బయలుదేరడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా ముస్లీం ఉద్యోగులకు ప్రభుత్వం ఈ మేరకు వెసులుబాటు కల్పించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పటినుంచంటే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను పాఠశాల విద్యాశాఖ సిద్ధం చేసింది. అయితే ఎండల తీవ్ర పెరుగుతున్నందున ఒంటిపూట బడులను మార్చి మొదటి వారం నుంచే నిర్వహించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.