
పక్కా వ్యూహంతో ముందుకెళ్లిన కూటమి.. అనుకున్నట్టుగానే గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) లో కూటమి జెండాను ఎగరేసింది.. పక్కా వ్యూహంతో అధికార కూటమి మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియో ఓట్లతో కలిపి 74 మంది మద్దతును కూడ గట్టుకుని.. మేయర్ హరి వెంకటకుమారిపై అవిశ్వాసాన్ని నెగ్గింది కూటమి.. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 74మంది ఓటేశారు. కోరం సరిపోవడంతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మేయర్ హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా.. 74 మంది మద్దతు తెలిపారుర. ఆదివారం కూటమి కార్పొరేటర్లు మేయర్‌ను ఎన్నుకోనున్నారు. కాగా.. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ బహిష్కరించింది.. కార్పొరేటర్లు సమావేశానికి హాజరు కావొద్దంటూ విప్ జారీ చేసినప్పటికీ.. వైసీపీ వ్యూహం ఫలించలేదు..
కాగా.. విశాఖలో ధర్మం, న్యాయం గెలిచాయన్నారు ఎంపీ సీఎం రమేష్. తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో వచ్చి మరీ ఆయన ఓటేశారు. వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడారన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. త్వరలోనే కొత్త మేయర్‌ను ఎన్నుకుని విశాఖను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖ ప్రజలకు మంచి పరిపాలన అందిస్తామని గంటా శ్రీనివాస్ పేర్కొన్నారు.
వీడియో చూడండి..
కూటమి సంబరాలు..
శనివారం ఉదయం 11 గంటలకు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాగా.. హెడ్ కౌంట్ అనంతరం అందరి వద్ద సంతకాలు తీసుకున్నారు.. అనంతరం ఓటింగ్ ప్రక్రియ జరిగింది. ఓటింగ్‌లో 74 మంది సభ్యుల బలంతో కూటమి విజయం సాధించింది. వైసీపీ మేయర్ వెంకట కుమారిపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని కూటమి నెగ్గడంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు సంబరాలు చేసుకుంటున్నాయి.