
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌పై పట్టుకు కూటమి ప్రయత్నిస్తోంది. మేయర్ సీటు టార్గెట్‌గా ప్రయత్నాలు చేస్తోంది. అవిశ్వాసం పెట్టేందుకు కలెక్టర్‌కి నోటీసు ఇచ్చారు కూటమి కార్పొరేటర్లు. టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్ నేతృత్వంలో కలెక్టర్‌ను కలిశారు. బలనిరూపణ సమయానికి తిరుగులేని మెజార్టీ ఉండే విధంగా కూటమి పావులు కదుపుతోంది. తాజాగా కూటమి గూటికి చేరారు ఆరుగురు వైసీపీ కార్పొరేటర్లు. మరింత మందిని చేర్చుకునే దిశగా కూటమి యత్నిస్తోంది. ఉన్న కార్పొరేటర్లు చేజారకుండా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది.
2021 ఎన్నికల్లో వైసీపీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. మొత్తం 98 కార్పొరేటర్ల స్థానాల్లో వైసీపీ 59 స్థానాలను కైవసం చేసుకుంది. వైసీపీ అధిష్టానం ఎందరో సీనియర్లను కాదని యాదవ సామాజికవర్గానికి చెందిన మహిళ గొలగాని హరి వెంకట కుమారికి మేయర్ పదవిని కట్టబెట్టింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మూడేళ్ల పాటు మేయర్ పదవికి ఎలాంటి డోకా లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి GVMCలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి.
చట్టప్రకారం అవిశ్వాసం పెట్టేందుకు మేయర్ పదవి కాలం నాలుగేళ్లు పూర్తవ్వాలి. అది ఈనెల 18తో పూర్తవడంతో కూటమి మరింత స్పీడ్‌గా రాజకీయం నడుపుతుంది. సాధ్యమైనంత సంఖ్యా బలాన్ని పెంచుకొని.. మేయర్ సీటుకు ఎసరుపెట్టాలని చూస్తోంది. అందుకోసం వైసీపీ కార్పొరేటర్లకు గాలం వేస్తోంది. ఈక్రమంలో అవిశ్వాసం కోసం కలెక్టర్‌కు నోటీసు ఇచ్చింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.