
కేరళలోలని ఇడుక్కి జిల్లా కొండల్లో రైతు లిను పీటర్ ఫామ్ లో నాలుగేళ్ల కిందట ఓ మేక పిల్ల జన్మించింది. అయితే దీని వయసు పెరుగుతున్నా ఎత్తు మాత్రం పెరగకపోవడం ఆ యజమాని గమనించాడు. సుమారు మేకలు ఉండే ఎత్తుకన్నా ఇది కేవలం 40 సెంటీమీటర్లు మాత్రమే పెరిగింది. అంటే 1 అడుగు 3 అంగుళాలు మాత్రమే. దీని పేరు కరుంబి. ఆ మధ్య ఓ అమెరికన్ టూరిస్టు దీన్ని చూసి ఆశ్చర్యపోయాడు. తన జీవితంలో ఇంత తక్కువ ఎత్తున్న మేకను ఇప్పటి వరకు చూడలేదని చెప్పడంతో ఆ మేక యజమాని మెదడులో ఓ సరికొత్త ఆలోచన మొదలైంది. వెంటనే దాన్ని తోలుకుని కేరళ ప్రభుత్వ జంతు సంరక్షణ శాఖ అధికారుల దగ్గరకు వెళ్లాడు.
తన మేక ఎత్తును క్షుణ్ణంగా కొలిపించాడు. ప్రపంచంలో దీనికన్నా తక్కువ ఎత్తున్న మేక లేదని తెలిసే సరికి ఆ విషయాన్ని అధికారులు సాయంతో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కించాడు. ఇంకేముందు ఈ విషయం బాగా ఫేమస్ కావడంతో ఈ బుజ్జి మేకకు ఇప్పుడు సెలబ్రిటీ స్టేటస్ వచ్చేసింది. అన్నట్టు.. ఇప్పుడీ మేక గర్భవతి కూడా. దీంతో దీనికి పుట్టబోయే పిల్లలు కూడా ఇంతే తక్కువ ఎత్తులో పుట్టొచ్చని అవి కూడా పుట్టుకతోనే రికార్డుల నమోదు చేస్తాయని యజమాని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.
ఇదే అసలు కారణం..
ఈ మేకలు ఇంత తక్కువ ఎత్తు ఉండటానికి కారణం వీటి జన్యువులే. సాధారణంగా పిగ్మీ జాతికి చెందిన మేకల్లోనే ఇలాంటి శారీరక లక్షణాలు కనిపిస్తాయి. పిగ్మీ జాతి మేకలు ప్రపంచంలోని అతి చిన్న మేకల జాతుల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందాయి. ఈ మేకలు మొదట పశ్చిమ ఆఫ్రికా ప్రాంతంలోని కామెరూన్ వ్యాలీలో కనిపిస్తాయి. అక్కడి స్థానికులు వీటిని వందల సంవత్సరాలుగా పెంచుకుంటూ వచ్చారు. తర్వాత, వీటిని అమెరికా, యూరప్ వంటి దేశాలకు తీసుకెళ్లి, పెంపుడు జంతువులుగా పాడి పశువులుగా అభివృద్ధి చేశారు. ఈ జాతి మేకలు తమ చిన్న పరిమాణం, స్నేహపూర్వక స్వభావంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆకర్షిస్తున్నాయి.
పిగ్మీ మేకల విశేషాలు
పిగ్మీ మేకలు సాధారణంగా 40 నుండి 50 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి, అంటే సామాన్య మేకల కంటే దాదాపు సగం పరిమాణంలో ఉంటాయి. వీటి బరువు 15 నుండి 25 కిలోల మధ్య ఉంటుంది. వీటికి చిన్న కొమ్ములు, మెత్తటి ఊలు, వివిధ రంగుల్లో కనిపించే శరీరం ఉంటాయి. నలుపు, తెలుపు, గోధుమ లేదా మచ్చలతో కూడా ఉంటాయి. వీటి ముఖం చూడటానికి చాలా ఆకర్షణీయంగా, పసి పిల్లలను గుర్తుచేసేలా ఉంటుంది.
ఎందుకింత స్పెషలంటే..
ఈ మేకలు చాలా స్నేహశీలిగా ఉంటాయి. అందుకే వీటిని పెంపుడు జంతువులుగా ఎక్కువగా పెంచుతారు. చిన్న పిల్లలతో కలిసి ఆడుకోవడానికి కూడా ఇవి సరిపడతాయి. అంతేకాదు, ఈ జాతి మేకలు తక్కువ పరిమాణంలో పాలు ఇస్తాయి. రోజుకు సుమారు ఒక లీటరు వరకు. ఈ పాలు చాలా పోషకమైనవిగా పరిగణించబడతాయి. కొందరు వీటి మాంసం కోసం కూడా పెంచుతారు, కానీ వీటిని ఎక్కువగా పెంపకం కోసమో, అలంకార జంతువులుగానో ఉపయోగిస్తారు.
కరుంబి: పిగ్మీ జాతి ఒక ఉదాహరణ
కేరళలోని కరుంబి అనే మేక ఈ జాతికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఈ నాలుగేళ్ల మేక 40.5 సెంటీమీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అతి చిన్న జీవన మేకగా గిన్నిస్ రికార్డు సాధించింది. ఇది పిగ్మీ మేకల ప్రత్యేకతను, విశిష్టతను ప్రపంచానికి చాటింది.
పెంచడం సులభం
పిగ్మీ మేకలకు చిన్న ప్రదేశం చాలు. ఇవి తక్కువ ఆహారంతోనే ఆరోగ్యంగా ఉంటాయి. గడ్డి, ఆకులు, కొన్ని ధాన్యాలు వీటికి సరిపోతాయి. వీటి ఆరోగ్యం కూడా సాధారణంగా బాగుంటుంది, అందుకే చిన్న రైతులకు ఇవి ఒక గొప్ప ఎంపిక.