
గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా దొరుకుతాయి. ఇదిలా ఉంటే.. చాలామందికి ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం అలవాటు. కానీ, ఇలా తాగితే నిజంగా ఆరోగ్యానికి మంచి చేస్తుందా.? లేక దుష్ప్రభావం ఏదైనా ఉందా.? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రోజూ గ్రీన్ టీ తాగడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. గ్రీన్ టీలోని కెటెచిన్స్, కెఫీన్ మెటబాలిజం రేటును పెంచుతాయి. ఉదయం ఖాళీ కడుపుతో తాగితే కేలరీలు వేగంగా కరిగి, బరువు తగ్గడంలో సహాయం లభిస్తుంది. అలాగే గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యంగా EGCG శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది. ఉదయాన్నే గ్రీన్ టీ తాగడం వల్ల రోజంతా శరీరం ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. గ్రీన్ టీలోని కెఫీన్, ఎల్-థియనైన్ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఉదయాన్నే తాగితే మన ఏకాగ్రత పెరగడమే కాదు.. రోజు చాలా ఫ్రెష్‌గా మొదలవుతుంది. అలాగే కొన్ని అధ్యయనాల ప్రకారం, గ్రీన్ టీ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచి, రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచేలా చేస్తుంది.
ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం వల్ల దుష్ప్రభావాలు..
ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం వల్ల.. అందులో ఉండే టానిన్స్ కడుపులో ఆమ్ల స్థాయిలను పెంచుతాయి. దీనివల్ల గుండెల్లో మంట, ఆసిడిటీ లేదా కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. కొందరికి ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగితే వాంతులు లేదా కడుపులో అసౌకర్యం లాంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి లక్షణాలు గ్రీన్ టీలోని కెఫీన్, ఇతర సమ్మేళనాల వల్ల రావచ్చు. గ్రీన్ టీలోని టానిన్స్ శరీరంలో ఐరన్ శోషణను అడ్డుకుంటాయి. రక్తహీనత సమస్య ఉన్నవారు ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం మంచిది కాదు. అటు ఉదయాన్నే ఎక్కువ మొత్తంలో గ్రీన్ టీ తాగితే ఒత్తిడి, తలనొప్పి లేదా గుండె దడ వంటి సమస్యలు రావచ్చు.
గ్రీన్ టీ ఎవరు తాగకూడదు?
-
ఆసిడిటీ, అల్సర్ లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు.
-
రక్తహీనత (అనీమియా) ఉన్నవారు.
-
కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారు
ఎలా తాగాలి?
-
ఉదయం ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడానికి బదులు, తేలికపాటి అల్పాహారం(బిస్కెట్ లేదా గుప్పెడు గింజలు) తిన్న 30 నిమిషాల తర్వాత తాగడం మంచిది.
-
రోజుకు 1-2 కప్పులు మాత్రమే తాగండి, అతిగా తాగవద్దు.
-
చాలా వేడిగా ఉన్న గ్రీన్ టీ తాగడం మంచిది కాదు, గోరువెచ్చగా తాగితే ఉత్తమం.