
అమరావతి, మార్చి 13: గత ప్రభుత్వం తప్పిదం వల్ల గత ఐదేళ్లలో 12 లక్షల మంది పేద పిల్లలకు చదువు దూరమైందని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా మూసే ప్రసక్తి లేదనీ అన్నారు. విద్యార్ధుల ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని ఏప్రిల్ 24 తర్వాత నేరుగా ఆయా కాలేజీల ఖాతాల్లో జమ చేస్తామని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో టీచర్లపై పెట్టిన కేసులను కూటమి సర్కార్ కొట్టివేస్తుందని అన్నారు. ఈ మేరకు విద్యారంగ సంస్కరణలపై మండలిలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల పతనానికి జీఓ-117 కారణమని, పదిమంది పిల్లల కంటే తక్కువ ఉన్న పాఠశాలలు టీడీపీ హయాంలో కేవలం 1215 ఉంటే, అదే జీఓ-117 వల్ల ఆ సంఖ్య 5,500కు చేరిందని అన్నారు. 20 మంది కంటే తక్కువ ఉన్న పాఠశాలల సంఖ్య 5,520 నుంచి 12,512కు పెరిగాయని వివరించారు.
ఒక్క విద్యార్ధి ఉన్నా కొనసాగిస్తామని.. ఒక్క ప్రభుత్వ పాఠశాలనూ మూసేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో ఒక నమూనా ప్రాథమిక పాఠశాల ఏర్పాటుచేసి, తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయిస్తామన్నారు. పాఠశాలల ప్రారంభానికి ముందే ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తామన్నారు. దీనికోసం అమరావతిలో ప్రపంచస్థాయి శిక్షణ అకాడమీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉందన్నారు. ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా ఆన్లైన్లో ఉంచుతామని, దాని ఆధారంగా బదిలీలు ఉంటాయని తెలిపారు.
‘ఈ ఏడాదిలోనే డీఎస్సీ నియామకాలు పూర్తి’
ఎస్సీ వర్గీకరణపై కమిటీ నివేదిక ప్రభుత్వానికి అందించిందని మంత్రి లోకేష్ తెలిపారు. ప్రభుత్వం దీన్ని పరిశీలిస్తోందని, అనంతరం కేబినెట్ ఆమోదంతో ఎస్సీ కమిషన్కు పంపుతామన్నారు. కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత డీఎస్సీ ప్రకటన జారీ చేస్తామన్నారు. మొత్తానికి ఈ ఏడాదిలోనే నియామక ప్రక్రియ పూర్తిచేస్తామని పేర్కొన్నారు. విద్యార్ధుల పుస్తకాల భారాన్ని కూడా తగ్గిస్తామన్నారు. గతంలో 8 పుస్తకాలు ఇచ్చేవారని, కానీ ఒకటో తరగతి విద్యార్థులకు మొదటి సెమ్లో 2, రెండో సెమ్లో 2 చొప్పున మొత్తం నాలుగు పుస్తకాలు ఇస్తామన్నారు. ఇలా అన్ని తరగతుల్లో పుస్తకాల సంఖ్య తగ్గించి పిల్లల బ్యాగ్ బరువు తక్కువ చేస్తామన్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.