
ఇంగ్లాండ్ లో నిల్వ చేసిన భారీ బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024 ఆర్థిక సంవత్సరంలో మన దేశానికి తీసుకువచ్చింది. దాదాపు వంద టన్నులు అంటే లక్ష కిలోల పసిడిని దేశీయ ఖజానాలో చేర్చింది. 1991 తర్వాత ఈ స్థాయిలో బంగారాన్ని తరలించడం ఇదే తొలిసారి. అప్పట్లో దేశంలోని ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకునేందుకు పెద్ద ఎత్తున బంగారాన్ని తనఖా పెట్టాల్సి వచ్చింది. రిజర్వ్ బ్యాంకు కొన్నేళ్లుగా బంగారాన్ని కొనుగోలు చేస్తూ వస్తోంది. దీన్ని ఎక్కడ నిల్వ చేయాలనే దానిపై ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటోంది. ఈ క్రమంలో విదేశాల్లో మన బంగారం నిల్వలు బాగా పెరిగాయి. వాటి నుంచి కొంత దేశానికి తీసుకురావాలని భావించింది. రవాణా, నిల్వ సర్దుబాట్లలో భాగంగానే ఇంగ్లండ్ నుంచి బంగారాన్ని తీసుకువచ్చింది. ముంబై మింట్ రోడ్డుతో పాటు నాగపూర్ లోని పాత కార్యాలయాల్లో బంగారాన్ని నిల్వ చేస్తారు.
బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ లో చాలా దేశాలు తమ బంగారాన్ని దాచుకుంటాయి. మన దేశం కూడా అక్కడ పెద్ద ఎత్తున పసిడిని నిల్వ చేసింది. 2024 మార్చి ముగిసే నాటికి ఆర్ బీఐ వద్ద 822.1 టన్నుల బంగారం ఉంది. దీనిలోని 413.8 టన్నులను ఇతర దేశాల్లో దాచింది. ఇటీవల బంగారాన్ని కొనుగోలు చేస్తూ వస్తున్న ఆర్ బీఐ గతేడాది 27.5 టన్నుల పసిడిని కొత్తగా నిల్వల్లో చేర్చింది. మన దేశం 1991 జనవరిలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. దిగుమతులతో పాటు అప్పులను చెల్లించడానికి కష్టపడింది. గల్ఫ్ యుద్దం కారణంగా చమురు ధరలు పెరిగి, పరిస్థితిని మరింత జటిలం చేశాయి. అప్పటికి మన దగ్గర ఒక బిలియన్ డాలర్ల కంటే తక్కువ ఫారెక్స్ నిల్వలు ఉన్నాయి. అవి మూడు వారాల పాటు దిగుమతి అవసరాలను తీర్చడానికి కూడా సరిపోవు. దీంతో అప్పటి ఆర్ బీఐ అధికారులు, కేంద్ర మంత్రులు ప్రపంచ ఆర్థిక సంస్థల సాయం కోరారు. అవి అందించిన 755 మిలియన్ డాలర్ల సాయం కూడా సరిపోలేదు.
అనేక రకాలుగా ప్రయత్నించినా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే అవకాశంలో లేకపోవడంతో ఇరవై టన్నుల బంగారాన్ని తాకట్టు పెట్టారు. స్వీట్జర్లాండ్ లోని యూబీఎస్ లో బంగారాన్ని తాకట్టు పెట్టేందుకు అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్షా ఫైల్ పై సంతకం చేశారు. 1991 మే చివరి నాటికి 200 మిలియన్ డాలర్ల రుణం తీసుకున్నారు. అనంతరం మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా పీవీ నరసింహారావు ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం జూన్ లో ప్రమాణ స్వీకారం చేసింది. బంగారాన్ని తాకట్టు పెట్టడం ద్వారా వనరుల సేకరణను కొనసాగింది. జూలైలో ఆర్ బీఐ 46.91 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ లకు 400 మిలియన్ డాలర్ల సేకరణకు తాకట్టుపెట్టింది. తర్వాత తిరిగి కొనుగోలు చేసింది.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..