
బంగారు ఆభరణాలకు నెక్ట్స్ లెవల్ ఏంటంటే డైమండ్ జ్యూయెలరీ. అల్ట్రా రిచ్ ఫ్యామిలీలు ఎక్కువగా మోజుపడేది వజ్రాభరణాల మీదే. ఎంగేజ్మెంట్స్కి మినిమమ్ డైమండ్ రింగు తొడక్కపోతే వాళ్లకు నామోషీ. మిడిల్ క్లాస్, ఎబౌ మిడిల్క్లాస్ కుటుంబాలకు నిన్నటిదాకా డైమండ్ అనేది ఒక ఫాంటసీ.. చాలా ఖరీదైన సమాచారం. కానీ.. రేపటిరోజున మధ్యతరగతి వర్గానికి బంగారం కూడా ఫాంటసీగానే మారబోతోందా..? లక్ష దాటుతున్న పదిగ్రాముల పసిడి.. మిడిల్క్లాస్ ఫ్యామిలీకి అందని ద్రాక్షగానే మిగలబోతోందా..?
ఎందుకంటే.. ఇవాళున్న పరిస్థితుల్లో ఫంక్షన్లొస్తే టెన్షన్లే. సగటు తండ్రి గుండెల్లో గులకరాయి పడ్డట్టే. ఇకమీదట కాసుబంగారమైనా స్టేటస్ సింబలే. ముఖ్యంగా ఆడపిల్ల పెళ్లికి పూనుకుంటే.. ఆ కుటుంబం బడ్జెట్ లెక్కలు పూర్తిగా మారిపోతాయి. అమ్మాయి నగలకు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టావని చూడరు.. మీ అమ్మాయికి ఎన్ని తులాలు పెడుతున్నావనే లెక్కలే ఆరా తీస్తారు అవతలివాళ్లు. అందుకే పెళ్లికి జ్యూవెలరీ షాపింగ్ అంటే ఆషామాషీ కాదు.
పైగా.. బంగారం ధరలు పెరిగినంత వేగంగా మధ్యతరగతి కుటుంబాల ఆదాయం పెరగడం లేదు. వేతన జీవుడి జీతభత్యాలు ఏటా పది లేదా పదిహేను శాతమే పెరుగుతాయి. ముఖ్యంగా అల్పాదాయ వర్గాలవారైతే అంతకంతకూ ఆర్థికంగా కుంగిపోతూనే ఉన్నారు. పీపుల్ రిసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్జ్యూమర్ ఎకానమీ.. PRICE.. అనే సంస్థ చేసిన సర్వే ప్రకారం ఒక మధ్యతరగతి కుటుంబం సగటు వార్షికాదాయం 5 లక్షలకు అటూఇటూనే. లోయర్ మిడిల్క్లాస్ మంత్లీ యావరేజ్ ఇన్కమ్ 33 వేలు. వీటిలో 19 వేల దాకా నెలవారీ ఖర్చులు పోనూ మిగతాది పొదుపు చేసుకోవడమో.. బంగారం కొనిపెట్టుకోవడమో చేసేవాళ్లు. కానీ.. అంతంత మాత్రంగా నడిచే అనేక రంగాల్లో శాశ్వత ఉపాధి అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. పడుతూ లేస్తున్న రియలెస్టేట్ లాంటి కొన్ని సెక్టార్స్లో ఐతే కూలీనాలీ చేసుకుని బతికేవాళ్లు, చిన్నసైజు జీతగాళ్లు ఆర్థికంగా అంతకంతకూ చితికిపోతున్నారు. ఒక నెల్లో వచ్చిన రాబడి మరుసటి నెల్లో వస్తుందన్న గ్యారంటీల్లేవు. సో.. పదోపదిహేనో వేలకు నెలంతా పనిచేసుకుని ఆ జీతంరాళ్ల మీదే బతుకుబండిని లాగేవాళ్లు.. బంగారం వైపు చూసే అవకాశాలే లేవిప్పుడు.
బ్రాండెడ్ బంగారం కొనుక్కునే బడా ఫ్యామిలీలు సైతం ఇప్పుడున్న ధరలతో బెంబేలెత్తిపోతున్నాయి. మరి.. పదికాసుల గొలుసు లేందే మెడ బోసిపోయినట్టుండే మధ్యతరగతి మగువల పరిస్థితి మరీ దారుణం. నెలకు వెయ్యో రెండువేలో మిగలబెట్టుకుని.. జ్యుయెలరీ షాపుల్లో పొదుపు స్కీములు కట్టుకుని.. ఏడాది కాగానే ఏదైనా వస్తువు కొనుక్కునేవాళ్లు కొందరు. పుట్టినరోజుకో పెళ్లిరోజుకో రెండుగ్రాముల ఉంగరమైనా తీసుకుందామని ఆశపడే వాళ్ల గుండెలు గుభేల్మంటున్నాయిప్పుడు.
సాంప్రదాయం కోసమో, కుటుంబ గౌరవం కోసమో, బంధుగణంలో పరువు పోతుందన్న బెంగతోనో కొన్నిసార్లు బంగారం కొనుగోలు చేయడం తప్పదు. తులమో అరతులమో కొనుక్కోవాల్సిన ఇటువంటి అత్యవసర పరిస్థితుల్లో మధ్యతరగతి జీవుడు ఏం చేస్తాడు.. అప్పోసప్పో చేసైనా సరే జ్యూవెలరీ షాపింగ్ చేస్తాడు.. ఆవిధంగా చేతులారా ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయి ఇల్లు గుల్ల చేసుకోక తప్పదా..? అందుకే.. లక్ష అనే ఆ రెండక్షరాలూ సగటు మధ్యతరగతి జీవుణ్ణి పీడకలలా వెంటాడుతున్నాయి.