

ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభంతోనే వినియోగదారులకు చమురు కంపెనీలు శుభవార్త చెప్పాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. ఈ తగ్గించిన ధరలు ఏప్రిల్ 1 నుంచే అమలులోకి వస్తాయని ప్రకటించాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్‌పై రూ.14 రూపాయలు తగ్గిస్తున్నట్టు వెల్లడించాయి. సవరించిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,762కి చేరింది. ముంబయిలో రూ.1,714.50, కోల్‌కతాలో రూ.1,872, చెన్నైలో రూ.1,924.50కి చేరింది. ప్రపచంవ్యాప్తంగా ముడి చమురు ధరలతో పాటు పలు కారణాలతో సాధారణంగా ప్రతినెలలోనూ చమురు కంపెనీలు ధరలను సర్దుబాటు చేస్తుంటాయి.
కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై మార్చి 1న రూ.6 ధర పెరిగిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 1న రూ.7 తగ్గించారు. తాజాగా మరోసారి ఈ సిలిండర్ ధర తగ్గించడంతో వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు కాస్త ఊరట లభించనట్టయింది. చమురు కంపెనీలు కమర్షియల్ సిలిండర్ ధరలను తగ్గించినా.. గృహ అవసరాల కోసం వినియోగించే వంటగ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. వాటి రేట్లు యధాతథంగా కొనసాగుతున్నాయి.
ఒక్కో సిలిండర్ ధర 803 రూపాయలు. ఇదివరకు కేంద్ర ప్రభుత్వం దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు పంపిణీ చేసే గృహావసర వంటగ్యాస్ కనెక్షన్ల ధరలో సబ్సిడీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక్కో గ్యాస్ కనెక్షన్‌పై 200 రూపాయల సబ్సిడీని ఇచ్చింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..