
ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ క్యాంపస్‌లో గురువారం మధ్యాహ్నం జరిగిన కాల్పుల ఘటన భయాందోళనలకు గురిచేసింది. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు 2 మంది మరణించారు.మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. అకస్మాత్తుగా స్టూడెంట్ యూనియన్ భవనంలో తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయి, ఆ తర్వాత వెంటనే క్యాంపస్‌ను మూసివేశారు. పోలీసులు, భద్రతా సంస్థలు.. విద్యార్థులు, అధ్యాపకులతో పాటు సిబ్బందిని సురక్షిత ప్రదేశాలలో ఆశ్రయం పొందాలని సూచించాయి. ఈ సంఘటన కారణంగా అన్ని తరగతులు, విశ్వవిద్యాలయ సంబంధిత కార్యక్రమాలు రద్దు చేయబడ్డాయి.
మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. దాదాపు అరగంట తరువాత విశ్వవిద్యాలయ పరిపాలన షెల్టర్-ఇన్-ప్లేస్ హెచ్చరికను జారీ చేసింది. పరిస్థితి మరింత దిగజారకముందే, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడి కోసం గాలింపు మొదలు పెట్టారు. అదే సమయంలో క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చినట్లు తల్లాహస్సీ మెమోరియల్ హెల్త్‌కేర్ సిస్టమ్ తెలిపింది.
“An active shooter has been reported in the area of Student Union. Police are on scene or on the way. Continue to seek shelter and await further instructions. Lock and stay away from all doors and windows, and be prepared to take additional protective measure,” tweets Florida… pic.twitter.com/TOgUy8QRn7
— ANI (@ANI) April 17, 2025
యూనివర్సిటీ హెచ్చరిక జారీ..
విశ్వవిద్యాలయం తమ విద్యార్థులు, సిబ్బంది అందరూ కిటికీలు, తలుపులకు దగ్గరగా ఉండవద్దని.. దూరంగా ఉండాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లవద్దని ఆదేశించింది. అలాగే క్యాంపస్‌లో లేని విద్యార్థులు ప్రధాన క్యాంపస్‌కు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. కాల్పుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని విశ్వవిద్యాలయ పరిపాలన గురువారం అన్ని తరగతులు, క్రీడా కార్యక్రమాలను రద్దు చేసింది.
అదుపులో అనుమానితుడు
అయితే పస్తుతం పరిస్థితి అదుపులో ఉందని… ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన వెనుక గల కారణం లేదా దాడి చేసిన వ్యక్తి ఉద్దేశ్యం గురించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఈ సంఘటన అమెరికాలోని విశ్వవిద్యాలయ ప్రాంగణాల భద్రత గురించి మరోసారి ప్రశ్నలను లేవనెత్తింది. పోలీసులు, FSU పరిపాలన దర్యాప్తు ప్రారంభించి, విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని హామీ ఇచ్చారు.
నిందితుల గురించి గవర్నర్ ఏం చెప్పారు?
ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో జరిగిన కాల్పులకు కారణమైన వ్యక్తిని జవాబుదారీగా ఉంచాలని ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ అన్నారు. కాల్పుల్లో మరణించిన ఇద్దరు వ్యక్తులకు సంతాపం తెలుపుతున్నామని.. ఈ ఘటన తనని తన భార్యని ఎంతో దుఃఖానికి గురి చేసిందని ఆయన అన్నారు. అలాగే తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరిన వారు కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని చెప్పారు. చట్ట అమలు సంస్థలు చేసిన పనికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పోలీసులు, భద్రతా సిబ్బంది.. చాలా మంది ప్రాణాలను కాపాడారనడంలో ఎటువంటి సందేహం లేదని రాన్ డిసాంటిస్ అన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..