
పాకిస్థాన్‌కు చెందిన మాజీ టెస్ట్ క్రికెటర్ ఫరూఖ్ హమీద్ (80) గురువారం దీర్ఘకాలిక అనారోగ్యంతో కన్నుమూశారు. ఫరూఖ్ హమీద్ మృతి పట్ల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) సంతాపాన్ని తెలిపింది. తన ఆటతో క్రికెట్ ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకున్న హమీద్, 1964లో ఆస్ట్రేలియాతో తన ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో ఆసీస్ దిగ్గజ కెప్టెన్ ఇయాన్ చాపెల్ వికెట్ తీసుకున్న ఘనత ఆయనది. కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్ అయిన ఫరూఖ్ హమీద్ 1961-62 నుంచి 1969-70 వరకు మొత్తం 43 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ కాలంలో 111 వికెట్లు పడగొట్టి, మూడు సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు.
1961-62లో ఫస్ట్-క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టిన ఫరూఖ్ హమీద్, తన కెరీర్ ప్రారంభంలోనే మంచి ప్రతిభ కనబరిచాడు. 1963లో పాకిస్థాన్ ఈగల్స్ తరపున ఇంగ్లాండ్‌లో పర్యటించిన హమీద్, అదే సంవత్సరంలో కామన్వెల్త్ జట్టుకు ఎంపికై పాకిస్థాన్ తరఫున రెండు మ్యాచ్‌లు ఆడాడు.
ఆ సమయంలోనే ప్రపంచంలో వేగంగా బౌలింగ్ చేసే బౌలర్లలో ఒకరిగా ఆల్ఫ్ గోవర్ గుర్తించినా, హమీద్ బౌలింగ్‌లో స్థిరత్వం లేదని పేర్కొన్నారు. అయినప్పటికీ, 1964-65లో పాకిస్థాన్ జట్టుతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టూర్‌కు వెళ్లి, మెల్బోర్న్ టెస్టులో ఆడే అవకాశం దక్కించుకున్నాడు.
పాకిస్థాన్ తరఫున 1964 డిసెంబర్లో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియాతో టెస్ట్ అరంగేట్రం చేసిన హమీద్, ఆ మ్యాచ్‌లో ఆసీస్ మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్‌ను అవుట్ చేసి క్రికెట్ చరిత్రలో తన పేరు లిఖించుకున్నాడు. అయితే, ఆ తర్వాత పాక్ జట్టులో స్థిరమైన అవకాశం దక్కించుకోలేకపోయాడు.
1969-70 వరకు పాకిస్థాన్‌లో ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడినా, అంతర్జాతీయ స్థాయిలో తగిన అవకాశాలు రాకపోవడంతో 1970 తర్వాత క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు.
ఫరూఖ్ హమీద్ 1964-65లో వెల్లింగ్టన్తో జరిగిన మ్యాచ్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 16 పరుగులకే 7 వికెట్లు పడగొట్టి, వెల్లింగ్టన్ జట్టును 53 పరుగులకే ఆలౌట్ చేశాడు. అంతేకాకుండా, 1967-68లో పెషావర్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (PIA) తరపున ఆడుతూ, మొదటి ఇన్నింగ్స్‌లో 30 పరుగులకే 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 20 పరుగులకే 5 వికెట్లు తీసి డబుల్ ఫైవర్ వికెట్ హాల్ సాధించాడు.
ఫరూఖ్ హమీద్ బంధువు ఖలీద్ అజీజ్ కూడా ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడిన క్రికెటర్. ఆయన టెస్ట్ అంపైర్‌గా కూడా పనిచేశాడు. అంతేకాకుండా, హమీద్ సోదరి తహిరా హమీద్ 1978లో పాకిస్థాన్ ఉమెన్స్ క్రికెట్ అసోసియేషన్ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. అసోసియేషన్ తొలి కార్యదర్శిగా ఆమె సేవలందించారు.
ఫరూఖ్ హమీద్ మృతిపై పాకిస్థాన్ ప్రధాని మహ్మద్ షెహబాజ్ షరీఫ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, “ఫరూఖ్ హమీద్ తన ఆట ద్వారా పాకిస్థాన్‌కు గౌరవాన్ని తెచ్చిపెట్టాడు. క్రికెట్లో ఆయన సేవలు చిరస్థాయిగా మిగిలిపోతాయి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు.
The PCB expresses its condolences on the passing of former Test fast bowler Farooq Hameed. He represented Pakistan in one Test match at the MCG against Australia in 1964. He took 111 wickets in 43 matches during his first-class career spanning from 1961/62 to 1969/70. pic.twitter.com/f3WRboib11
— Pakistan Cricket (@TheRealPCB) April 3, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..