
ఈపీఎఫ్ఓ సభ్యలు త్వరలో యూపీఐతో పాటు ఏటీఎంల ద్వారా తమ నిధులను ఉపసంహరించుకునేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మే లేదా జూన్ చివరి నాటికి కోట్లాది మంది ఉద్యోగులకు ఈ సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు విప్లవాత్మక ఉపసంహరణ వ్యవస్థను ప్రవేశపెట్టనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా ఉపసంహరణలను అనుమతిస్తుంది. భారతదేశంలో రిటైల్ చెల్లింపులతో పాటు సెటిల్మెంట్ వ్యవస్థలను నిర్వహించే ఒక అంబ్రెల్లా సంస్థ అయిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సిఫార్సుకు కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిన తర్వాత ఈ మేరకు చర్యలు తీసకుంటున్నారు.
ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) సభ్యులు మే లేదా జూన్ చివరి నాటికి యూపీఐతో పాటు ఏటీఎంల ద్వారా తమ నిధులను ఉపసంహరించుకోగలగుతారని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుమితా దావ్రా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత దాదాపు రూ. లక్ష వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే నగదు బదిలీల కోసం వారికి నచ్చిన బ్యాంక్ ఖాతాను ఎంచుకోవచ్చని పేర్కొన్నారు. పీఎఫ్ యాక్సెసిబిలిటీలో పరివర్తనాత్మక మార్పు ఉంటుందని సభ్యులు యూపీఐ ద్వారా తమ పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్‌ను కూడా తనిఖీ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. విత్‌డ్రా ఎంపికలను విస్తరించడం వల్ల ఆర్థిక సౌలభ్యం మాత్రమే కాకుండా సభ్యులు గృహనిర్మాణం, విద్య, వివాహం కోసం నిధులను త్వరగా ఉపసంహరించుకోవడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు.
ఈపీఎఫ్ఓ తన ప్రక్రియలను డిజిటలైజ్ చేయడంలో గణనీయమైన పురోగతి సాధించింది. ఉపసంహరణ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి 120 కి పైగా డేటాబేస్లను ఏకీకృతం చేసింది. క్లెయిమ్ ప్రాసెసింగ్ సమయం కేవలం 3 రోజులకు తగ్గించారు. 95 శాతం క్లెయిమ్‌లు ఇప్పుడు ఆటోమేటెడ్ అయ్యాయి. ఇటీవలి సంస్కరణలు పెన్షనర్లకు కూడా ప్రయోజనం చేకూరుస్తున్నాయి. డిసెంబర్ 2024 నుంచి 78 లక్షల మంది పెన్షనర్లు ఏ బ్యాంకు శాఖ నుంచైనా నిధులను ఉపసంహరించుకునేందుకు అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం ఈపీఎఫ్ఓలో 7.5 కోట్లకు పైగా క్రియాశీల సభ్యులు ఉన్నారు. అలాగే దేశవ్యాప్తంగా 147 ప్రాంతీయ కార్యాలయాలల్లో ప్రతి నెలా 10 నుంచి 12 లక్షల మంది కొత్త సభ్యులను చేర్చుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి