

ఇంగ్లిష్.. ఈ పేరు వింటేనే చాలా మందికి కాళ్లు వణుకుతాయి. ఇక నలుగురిలో మాట్లాడాలంటే ఇక వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. నిజానికి ఈ విదేశీ భాష అంత కష్టమైందేమీ కాదు. కానీ దీని చుట్టూ చాలా మంది క్రియేట్ చేసిన భయాలే మనల్ని ఎక్కువగా భయపెడుతుంటాయి. చాలా మందికి ఇంగ్లిష్ వచ్చినప్పటికీ నలుగురిలోకి వెళ్లేసరికి ఉన్నదంతా మర్చిపోతుంటారు. మరికొందరు అసలు మాట్లాడే ప్రయత్నమే చేయరు. ఇలా జరగకుండా మీరు ఇంగ్లిష్ లో అనర్గళంగా మాట్లాడాలంటే ఈ సారి ఈ సీక్రెట్ టిప్ ఒకటి పాటించి చూడండి.
గ్రామర్ నిజంగా అవసరమా..
ఇంగ్లిష్ కోచింగ్ సెంటర్లు, స్కూళ్లు, కాలేజీలు ఇలా ఎక్కడ చూసినా ఇంగ్లిష్ పేరు చెప్పగానే ముందు గ్రామర్ నేర్చుకోవాలంటారు. కానీ ఇది మూస ధోరణి. మీరే ఒకసారి ఆలోచించండి.. చిన్న పిల్లలు అప్పుడప్పుడే మాటలు నేర్చుకుంటారు. మరి వారేం గ్రామర్ నేర్చుకుని మాట్లాడతారు. అందుకే ఏ భాష నేర్చుకోవడానికైనా గ్రామర్ వందశాతం అవసరం అని చెప్పలేం. అది భాష నేర్చుకోవడానికి అనేక విధాలుగా ఉన్న పద్ధతుల్లో ఒకటి మాత్రమే.
చూసి నేర్చుకోండి..
ఇది అందరూ చెప్పే మాటే. కానీ ఏం చూసి నేర్చుకోవాలి.. ఎక్కడ నేర్చుకోవాలి ఎవరూ చెప్పరు. కొత్త భాషను నేర్చుకోవడానికి అత్యంత సులభమైన పద్ధతి ఇమిటేషన్. అవును.. మీరు అనుకరించడం ద్వారా అందరికన్నా ఎక్కువ ఇంగ్లిష్ మాట్లాడగలరు. ఆఫీస్ లోనో, మెట్రోలోనో.. ఒక వ్యక్తి తన ఫీలింగ్ ను చెప్పడానికి ఇంగ్లిష్ లో ఏం పదాలు వాడుతున్నాడో కనిపెట్టండి. వాటిని అలాగే రాసుకోండి. తిరిగి ఆ సందర్భం వచ్చినప్పుడు మీరు కూడా అంతే కాన్ఫిడెంట్ గా వాటిని మాట్లాడేయండి. ఇలా రోజుకో సెంటెన్స్ నేర్చుకున్నా నెల రోజుల్లో రోజూవారి మాటలను కవర్ చేసేయొచ్చు.
ఇవి ఫాలో అవుతున్నారా..
మీ ఫోన్ లో రీల్స్ చూసే సమయంలో కనీసం పావు వంతు కేటాయించినా మీరు ఈ భాషలో మాస్టర్ అయిపోవచ్చు. అదెలా అంటారా.. ఎప్పుడూ మీకు వచ్చిన భాషలోనే రీల్స్, టీవీ షోలు చూడటం మానేయండి. ఇంగ్లిష్ సినిమాలు, షోలు, ప్రోగ్రామ్ లు చూడండి. వారెలా పదాలను ఎక్స్ ప్రెస్ చేస్తున్నారో ఓసారి గమనించండి. మీరు ఇలాంటి ధోరణితో టీవీని ఎప్పుడూ చూసి ఉండరు. ఇది ప్రాక్టీస్ చేయండి తేడా మీకే తెలుస్తుంది.
ఇలా మొదలు పెట్టండి..
ఇంగ్లిష్ లో పెద్ద పెద్ద స్పీచ్ లు ఇవ్వడం గురించి మానండి.. ముందు రోజూవారి కన్వర్జేషన్ ను ఎలా చేయాలో తెలుసుకోండి. ఇవి మేనేజ్ చేయగలిగితే మీకు కాన్ఫిడెన్స్ దానంతట అదే వస్తుంది. మీ గురించి ఇంగ్లిష్ లో ఎలా చెప్పాలో తెలుసుకోండి. చేసే ప్రతి పనిని స్మార్ట్ ఫోన్ సాయంతో ఇంగ్లిష్ సెంటెన్స్ కనిపెట్టండి. వీలైతే మీ స్నేహితుల సాయం తీసుకోండి.