
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో మార్పులకు వేదిక సిద్ధమవుతోంది. ఇటీవల జోస్ బట్లర్ వైట్-బాల్ ఫార్మాట్లలో కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో, టీ20, వన్డే జట్లకు కొత్త నాయకత్వం అవసరమైంది. ఈ క్రమంలో టీ20 ఫార్మాట్‌కు యువ ఆటగాడు హ్యారీ బ్రూక్‌ను కెప్టెన్‌గా నియమించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. 26 ఏళ్ల బ్రూక్ ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో ప్రధాన ఆటగాడిగా ఎదగడమే కాకుండా, బట్లర్‌కు ఉప కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం కూడా కలిగి ఉన్నాడు. అయినప్పటికీ, అతను ఇటీవల భారత్, పాకిస్తాన్ పర్యటనల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అంతేకాకుండా, అంతర్జాతీయ క్రికెట్‌పై దృష్టి పెట్టడానికి IPL-2025 సీజన్‌కు కూడా దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో టీ20 జట్టుకు అతన్ని కెప్టెన్ చేయాలన్న ఆలోచనకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మొగ్గు చూపుతోంది, ముఖ్యంగా వచ్చే ఏడాది భారతదేశంలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ దృష్టిలో ఉంచుకుని.
ఇక వన్డే జట్టు విషయానికి వస్తే, బ్రూక్‌తో పాటు టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ పేరు కూడా పరిశీలనలో ఉంది. బ్రూక్ ఒకే సమయంలో రెండు ఫార్మాట్లకి నాయకత్వం వహిస్తే, అతనిపై భారీ ఒత్తిడి పెరగనుంది. ఇక స్టోక్స్ విషయానికి వస్తే, ఇటీవల గాయాల కారణంగా చాలా కాలంగా వైట్-బాల్ క్రికెట్ ఆడలేకపోయాడు. ఈ ఏడాది IPL, ది హండ్రెడ్ లీగ్‌లను కూడా దాటవేసి ప్రధానంగా టెస్ట్ క్రికెట్‌పై దృష్టి సారించాడు. అయినప్పటికీ, టెస్ట్ కెప్టెన్‌గా స్టోక్స్ అందించిన విజయాల పర్యవసానంగా, గత మూడు సంవత్సరాల్లో ఇంగ్లాండ్ 19 టెస్టుల్లో గెలిచిన నేపథ్యం, వన్డే కెప్టెన్సీకి అతనిపేరు బలంగా వినిపిస్తోంది. అయితే అతని ఫిట్నెస్ ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉంది.
ఇంగ్లాండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ కూడా స్టోక్స్‌ను ODI కెప్టెన్‌గా నియమించే అవకాశాలపై స్పందించారు. జట్టుకు లభించిన విజయాల్లో అతని నాయకత్వ పాత్ర కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ స్టోక్స్ ఫిట్నెస్ పట్ల సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉందని స్పష్టం చేశారు. మరోవైపు, ఇంగ్లాండ్ వచ్చే వైట్-బాల్ మ్యాచ్‌లు జూన్‌లో వెస్టిండీస్‌తో జరగనున్న నేపథ్యంలో, కొత్త నాయకత్వాన్ని త్వరలోనే ఖరారు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ పరిణామాల మధ్య, హ్యారీ బ్రూక్‌కి టీ20లో నాయకత్వ బాధ్యతలు దక్కడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తుండగా, వన్డే కెప్టెన్సీకి బ్రూక్, స్టోక్స్‌ల మధ్య చివరి నిర్ణయం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు నియామకాలు ఇంగ్లాండ్ వైట్-బాల్ క్రికెట్ భవిష్యత్తును నిర్ధేశించనున్నాయి.
🚨 Harry Brook to be named England T20 captain. (The Telegraph)
– Ben Stokes in line for the ODI captaincy. pic.twitter.com/9r1uisNXDT
— 𝙎𝙝𝙚𝙧𝙞 (@CallMeSheri1) April 3, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..