

మాట వింటే ఓకే.. లేకుంటే దూసుకొచ్చేది బాకే! ఇదీ.. ట్రంప్ స్టైల్ ఆఫ్ డైలాగ్ అండ్ యాక్షన్. తన మాట వినే దేశాల మీద ఎలాంటి యాక్షన్ ఉండదు. కాదు కూడదంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రియాక్షన్…ఓ రేంజ్లో ఉంటుంది. ఆల్ కంట్రీస్‌కి సేమ్ ఫార్ములా అప్లయ్ చేస్తున్నారు అగ్రరాజ్యం అన్నయ్య. కుదిరితే డీల్.. లేదని డేర్ చేస్తే వార్ తప్పదని వార్నింగ్ ఇచ్చేస్తున్నారు మిస్టర్ ప్రెసిడెంట్ ట్రంప్.
తెరలు తొలగిపోయాయి. ముసుగులు జారిపోయాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనితీరులో స్పష్టమైన క్లారిటీ కనిపిస్తోంది. మాటలు చేతల్లో అసలు రియాలిటీ తెలిసొస్తోంది. మొదట ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని రష్యాతో చర్చలకు ఒప్పించారు. అమెరికాకు రా రమ్మని ఆహ్వానించారు. అయితే వైట్‌హౌస్‌లో ఫైట్‌తో అసలు రూపం చూపించారు ట్రంప్. వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్‌తో కలిసి జెలెన్స్కీని జాయింట్‌గా కుమ్మేశారు. ఉక్రెయిన్‌లో ఉన్న అత్యంత అరుదైన, ఖరీదైన ఖనిజాల కోసం, తనలో ఒరిజినాలినీ, అసలు పర్సనాలిటీని జెలెన్స్కీకి రుచి చూపించారు. చర్చలు విఫలమై జెలెన్ స్కీ తిరుగు టపా కట్టగానే, పాత మిత్రుడు పుతిన్‌కు ట్రంప్ ఏం చెప్పారో ఏమో గానీ, భీకరమైన దాడులతో ఉక్రెయిన్‌ని అల్లాడిస్తోంది రష్యా. ట్రంప్‌తో డీల్ కుదుర్చుకోకపోతే, సీన్ సితార్ అయిపోతుందని జెలెన్స్కీకి లేటుగా అర్థమైంది.
గాజాపై మోజు పడ్డ ట్రంప్.. రియల్ ఎస్టేట్ ఆశలు
ఇక గాజాను కాజాలా నమిలి మింగేద్దామనుకున్నారు ట్రంప్. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తానతందాన అంటూ ట్రంప్ రాగంలో స్వరం కలిపారు. గాజాలో ఉన్న 20లక్షలమందిని తరిమేసి దాన్ని రియల్ ఎస్టేట్ వండర్‌గా మార్చెయ్యాలని ఉందని మనసులో మాట చెప్పేశారు అమెరికా అధ్యక్షుడు. హమాస్ మాత్రం గట్టిగా నో చెప్పడంతో…ట్రంప్‌కు ఎక్కడో గుచ్చుకున్నట్లయింది. నాతో పెట్టుకుంటావా, నీ సంగతి చెప్తా చూడు అంటూ ఇజ్రాయెల్‌కి గట్టిగా కీ ఇచ్చేశారు. దీంతో గాజాలో మనిషి చెట్టు పుట్ట అన్ని మాడిపోయేట్లు బాంబుల వర్షం కురిపిస్తోంది ఇజ్రాయెల్. భవిష్యత్తులో గడ్డిపరక కూడా మొలవని బంజరుభూమిగా దాన్ని మార్చేస్తోంది. ట్రంప్‌తో డీల్‌కు నో చెబితే బతుకు బస్టాండ్ అయిపోతుందని, పగలురాత్రి నెత్తి మీద కురుస్తున్న క్షిపణుల వర్షంతో హమాస్‌కి క్రిస్టల్ క్లియర్‌గా అర్థమైంది.
అణు ఒప్పందం కోసం ఇరాన్‌పై ఒత్తిడి
ఆ తర్వాత అణు ఒప్పందం కుదుర్చుకోవాలంటూ ఇరాన్‌కు హుకుం జారీ చేశారు ట్రంప్. వాళ్లు మొరాయించడంతో సైనిక చర్య తప్పదంటూ వార్నింగ్ ఇచ్చి పడేశారు. త్వరలో ఇరాన్ మీద ఎలాంటి యాక్షన్ షురూ చేస్తారో చూడాలి. ఇక భారత్‌తో సహా దాదాపు 75 దేశాలు, ట్రంప్ టారిఫ్ వార్ మీద రివర్స్ అవలేదు. అమెరికా మీద ప్రతీకార సుంకాలు విధించలేదు. చర్చలకు సిద్ధమన్నాయి. దీంతో ఈ దేశాలన్నింటికి భారీ టారిఫ్‌ల నుంచి 90 రోజుల బ్రేక్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు. అయితే ట్రేడ్ వార్‌లో తనతో ఢీ అంటే ఢీ అంటున్న చైనాకు మాత్రం చెక్ పెట్టారు. ట్రేడ్ డీల్ కుదుర్చుకోకపోగా, మామీదే ప్రతీకార సుంకాలు విధిస్తారా అంటూ చైనా మీద లేటెస్టుగా 145 శాతం సుంకాలు విధించారు.
డీల్ కావాలా వార్ కావాలా మీరే తేల్చుకోండంటూ ప్రపంచంతో ఫుట్‌బాల్ ఆడుతున్నారు ట్రంప్. ఈ విపరీత పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి