ఇట్స్ ట్రంప్ టైమ్.! ఔను.. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ టైమ్ మొదలైంది. వాషింగ్టన్‌లోని క్యాపిటల్ రుటండా లోపల అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు డొనాల్డ్ ట్రంప్. యూఎస్‌కు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి 25 వేల మందితో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి భారత ప్రతినిధిగా విదేశాంగమంత్రి జైశంకర్ హాజరయ్యారు. ఈ వేడుకకు ప్రపంచ దేశాధినేతలు, వ్యాపార దిగ్గజాలు, సెలబ్రిటీలు, ట్రంప్ అనుచరులు హాజరయ్యారు. ట్రంప్ కంటే ముందు ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణం చేశారు.
ఇక ట్రంప్ రెండోసారి అధికారిక పగ్గాలు చేపడుతుండటంతో ప్రపంచదేశాలు కొంచెం ఇష్టం కొంచెం కష్టంగా ఫీలవుతున్నాయి. అమెరికా ఫస్ట్ నినాదంతో పనిచేస్తానన్న ట్రంప్ నిర్ణయాలు తమ దేశాలను ఎలా ప్రభావితం చేస్తాయోనన్న ఆందోళనను కొన్ని దేశాలు బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నాయి. అటు ప్రమాణ స్వీకారానికి ముందు ప్రముఖులకు ట్రంప్ విందు ఇచ్చారు. ట్రంప్ ఇచ్చిన విందులో ముకేష్ అంబానీ దంపతులు హైలైట్‌గా నిలిచారు. అంబానీ దంపతులతో ట్రంప్ ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రమాణ స్వీకారం అనంతరం ట్రంప్ కీలక ప్రసంగం చేశారు.
ట్రంప్ వ్యక్తిగతం విషయానికొస్తే.. డొనాల్డ్ ట్రంప్ 1946 జూన్ 14న న్యూయార్క్‌లో మేరీ, ఫ్రెడ్ దంపతులకు జన్మించారు. ఈయన తండ్రి ఫ్రెడ్ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, 1971లో తండ్రి వ్యాపార సామ్రాజ్యాన్ని స్వీకరించారు. ట్రంప్ తొలుత ఇవానాను పెళ్లి చేసుకుని 1990లో విడాకులిచ్చారు. వీరికి ముగ్గురు పిల్లలు. ఆ తర్వాత నటి మార్లాను పెళ్లాడారు. వీరికి ఒక కూతురు. 1999లో విడాకులు తీసుకుని 2005లో మెలానియాను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి