
తేనె ఆరోగ్యానికి మంచిదని చాలామంది భావిస్తారు. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. మరి డయాబెటిస్ రోగులు తేనె తీసుకోవడం సురక్షితమేనా.? ఇది రక్తంలో చక్కెర స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తుంది.? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. తేనెలో సుమారు 80 శాతం సహజ చక్కెరలు(గ్లూకోస్, ఫ్రక్టోస్) ఉంటాయి. మిగిలినవి నీరు, విటమిన్లు(విటమిన్ సి, బి), ఖనిజాలు(కాల్షియం, ఐరన్), యాంటీఆక్సిడెంట్లు. ఇది సాధారణ చక్కెర కంటే మంచిదని భావిస్తారు. కానీ దీనిలోని చక్కెరలు రక్తంలో గ్లూకోస్ స్థాయిలను పెంచగలవు.
డయాబెటిస్ రోగులపై తేనె ప్రభావం..
రక్తంలో చక్కెర పెరుగుతుంది
తేనెలో గ్లైసెమిక్ ఇండెక్స్(GI) సాధారణ చక్కెర కంటే కొంచెం తక్కువగా ఉంటుంది(సుమారు 50-60). అయినప్పటికీ, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచుతుంది. డయాబెటిస్ రోగులు తేనె తీసుకుంటే గ్లూకోస్ స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది.
సాధారణ చక్కెర కంటే..
కొన్ని అధ్యయనాల ప్రకారం, తేనె సాధారణ చక్కెర కంటే రక్తంలో షుగర్ లెవెల్స్‌ను త్వరగా పెరిగేలా చేయదు. ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా కొద్దిగా మెరుగుపరుస్తుంది. అది కూడా అంత ఎక్కువ కాదు.. అందుకే తేనె బెస్ట్ ఆప్షన్ అని చెప్పలేం.
కేలరీలు ఎక్కువ
ఒక టీస్పూన్ తేనెలో సుమారు 20-25 కేలరీలు ఉంటాయి. ఎక్కువ మొత్తంలో తీసుకుంటే డయాబెటిస్ రోగుల బరువు పెరగడానికి కూడా దారితీయవచ్చు. ఇది డయాబెటిస్‌ను మరింత జటిలం చేస్తుంది.
డయాబెటిస్ రోగులు తేనె తీసుకోవచ్చా?
డయాబెటిస్ రోగులు తేనెను మితంగా తీసుకోవడం మంచిది. రోజుకు 1-2 టీస్పూన్లు మించకుండా తీసుకోవచ్చు. అది కూడా రక్తంలో చక్కెర స్థాయిలను చెక్ చేసిన తర్వాతనే తీసుకోవాలి. లేదా.. డయాబెటిస్ రోగులు తమ డాక్టర్ లేదా డైటీషియన్‌ను సంప్రదించి, తమ ఆరోగ్య పరిస్థితికి తేనె సరిపడుతుందా లేదా అని తెలుసుకున్న తర్వాత తీసుకోవడం మంచిది. తేనెను ఖాళీ కడుపుతో తీసుకోవడం కంటే భోజనంతో కలిపి తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగకపోవచ్చు. కాగా, తేనె ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ, డయాబెటిస్ రోగులు దీన్ని మితంగా తీసుకోవాలి. నార్మల్ షుగర్ కంటే ఇది బెటర్ ఆప్షన్. డయాబెటిస్ రోగులు తేనెను డైట్లో చేర్చాలని అనుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.