Dawood Ibrahim : క్రికెట్ మైదానంలో టీమిండియాకు తొలి వరల్డ్ కప్ అందించిన హర్యానా హరికేన్ కపిల్ దేవ్ ధైర్యం గురించి మనందరికీ తెలిసిందే. అయితే కేవలం పిచ్ మీద బ్యాట్, బాల్తోనే కాదు.. బయట కూడా ఆయన అంతే గంభీరంగా ఉంటారు. ఒకానొక సమయంలో ప్రపంచాన్నే వణికించిన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను కూడా కపిల్ దేవ్ ఏమాత్రం లెక్కచేయకుండా డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు పంపేశారు. ఈ వింత సంఘటన 1986లో షార్జాలో జరిగింది. అప్పట్లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే యుద్ధంలా ఉండేది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు క్రికెట్ అంటే పిచ్చి. షార్జాలో జరిగే ప్రతి మ్యాచ్‌కు అతను హాజరయ్యేవాడు. అయితే ఆ రోజు ఇండియా-పాకిస్థాన్ ఫైనల్ మ్యాచ్‌కు ఒక రోజు ముందు, భారత ఆటగాళ్లంతా డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రాక్టీస్ ముగించుకుని సేదతీరుతున్నారు. ఆ సమయంలో ప్రముఖ నటుడు మెహమూద్తో కలిసి ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు.
మెహమూద్ ఆ వ్యక్తిని ఒక పెద్ద బిజినెస్మెన్ అని ఆటగాళ్లకు పరిచయం చేశాడు. ఆ వ్యక్తి ఆటగాళ్లతో మాట్లాడుతూ.. “రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్‌లో మీరు పాకిస్థాన్‌ను ఓడిస్తే, టీమ్‌లోని ప్రతి ఆటగాడికి ఒక లేటెస్ట్ టయోటా కోరొల్లా కారును గిఫ్ట్‌గా ఇస్తాను అని ఆఫర్ ఇచ్చాడు. అప్పట్లో విదేశీ కార్లు అంటే చాలా పెద్ద విషయం. కానీ ఆ వ్యక్తి ఎవరో తెలియక ఆటగాళ్లంతా ఆశ్చర్యపోయి మౌనంగా ఉండిపోయారు.
సరిగ్గా అదే సమయంలో కెప్టెన్ కపిల్ దేవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ముగించుకుని డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చారు. లోపల ఎవరో తెలియని వ్యక్తులు ఉండటం చూసి ఆయనకు కోపం వచ్చింది. క్రమశిక్షణకు మారుపేరైన కపిల్.. ముందుగా మెహమూద్తో మాట్లాడుతూ.. “మెహమూద్ భాయ్, మీరు బయటకు వెళ్లండి” అని చెప్పారు. ఆ తర్వాత పక్కనే ఉన్న ఆ బిజినెస్మెన్ వైపు చూస్తూ ఎవరీయన? ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇప్పుడే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళమని చెప్పు అని గట్టిగా అరిచారు.
కపిల్ దేవ్ గొంతులో ఉన్న గాంభీర్యం, కోపం చూసి దావూద్ ఇబ్రహీం ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెనుతిరిగాడు. అతను వెళ్ళిపోయాక ఆటగాళ్లు కపిల్ దేవ్ దగ్గరకు వచ్చి పాజీ.. నువ్వు బయటకు పంపింది ఎవరో తెలుసా? అతను అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అని చెప్పారు. అది విన్నాక కూడా కపిల్ ఏమాత్రం భయపడలేదు. ఎవరైతే నాకేంటి? డ్రెస్సింగ్ రూమ్‌లోకి బయటి వ్యక్తులకు అనుమతి లేదు అని తేల్చి చెప్పారు. దావూద్ పట్ల అంత కఠినంగా వ్యవహరించిన ఏకైక క్రికెటర్ బహుశా కపిల్ దేవ్ మాత్రమేనేమో.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
